భారీ అగ్గి.. కోట్లు బుగ్గి

29 Aug, 2019 03:23 IST|Sakshi
మంటలు అదుపు చేస్తున్న ఫైర్‌ సిబ్బంది

చర్లపల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం

మరో కంపెనీలోకి మంటల వ్యాప్తి

ఆర్గానిక్‌ ఫ్లాంట్‌లో రూ.25 కోట్లు ఆస్తి నష్టం..మరో కంపెనీలో రూ.కోటికి పైగా 

లైసెన్సు లేకుండా కంపెనీ నిర్వహణ 

యజమానికి నోటీసులు జారీచేసిన అధికారులు 

కుషాయిగూడ: చర్లపల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో ఎగిసిపడ్డ మంటలు పక్కనే ఉన్న మరోకంపెనీకి కూడా వ్యాపించడంతో భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. బుధవారం తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. చర్లపల్లి పారిశ్రామికవాడ లోని ఓ శీతల గిడ్డంగిని తల్లూరి సతీశ్‌ అనేవ్యక్తి లీజుకు తీసుకుని సన్సేషనల్‌ ఆర్గానిక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో ఆర్గానిక్‌ ఫర్టిలైజర్స్‌ తయారీ ప్లాంట్‌ను నిర్వహిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున ఫ్లాంట్‌లోని లేబుల్స్, ప్యాకింగ్‌ అట్టలు భద్రపరిచిన గదిలో షాట్‌సర్క్యూట్‌ అయి మంటలు చెలరేగాయి. అవి ఫర్టిలైజర్స్‌లో కెమికల్స్‌కు బదులుగా వినియోగించే ఆయిల్‌ డబ్బా ల వరకూ వ్యాపించడంతో భారీగా పేలుడు సంభవించింది. దీంతో మంటల ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి.

పేలుడు ధాటికి కంపెనీ క్వార్టర్స్‌లో ఉన్న నలుగురు కార్మికులు కేకలు వేస్తు భయంతో పరుగులు తీశారు. స్థానిక ఫైర్‌స్టేషన్‌కు అగ్ని ప్రమాదం సమాచారాన్ని ఇవ్వగా అగ్నిమాపకదళం అక్కడకు చేరుకుని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేసింది. అయితే అప్పటికే మంటలు పక్కనే ఉన్న బోర్‌డ్రిల్స్‌ ఫ్యాక్టరీ బెన్‌వర్‌ట్రాక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది శ్రమించి ఆ మంటల్ని సాయంత్రం ఐదు గంటలకు అదుపులోకి తీసుకురాగలిగారు. ఈ ప్రమాదంలో ఆర్గానిక్‌ ఫ్యాక్టరీకి చెందిన సుమారు రూ. 25 కోట్ల విలువైన ముడి సరుకు మంటల్లో కాలి బూడిదైపోయింది. ఈమేరకు కంపెనీ యజమాని సతీశ్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక బోర్‌వెల్‌ డ్రిల్స్‌ కంపెనీకి రూ. కోటికి పైగానే ఆస్తినష్టం వాటిల్లిందని నిర్వాహకుడు నవీన్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  

ప్లాంట్‌ యజమానికి నోటీసులు 
ఆర్గానిక్‌ ప్లాంట్‌ నిర్వహణకు యజమాని తమనుంచి ఎలాంటి అనుమతులు పొందలేని ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ జంగయ్య తెలిపారు. దీంతో ప్లాంట్‌ యజమానికి నోటీసులు జారీ చేయడంతో పాటుగా ఈ ఘటనను జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. అగ్నిప్రమాదం విషయం తెలిసిన కుషాయిగూడ ఏసీపీ శివకుమార్, ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్, ట్రాఫిక్‌ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. పరిసర ప్రాంతాలన్నీ దట్టమైన పొగలు వ్యాపించడంతో ఆ మార్గంలో రోడ్డును మూసివేసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

మరిన్ని వార్తలు