‘భారీ’లక్ష్యం.. పనుల్లో నిర్లక్ష్యం

22 May, 2015 05:45 IST|Sakshi

జూరాల : వచ్చే ఖరీఫ్‌లో జిల్లాలోని నాలుగు ప్రధాన ప్రాజెక్టుల నుంచి 3.71లక్షల ఆయకట్టుకు నీళ్లివ్వాలన్న అధికారుల లక్ష్యం నెరవేరేలా లేదు.  పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయి. జిల్లాలో నాలుగు ప్రాజెక్టులు చేపట్టేందుకు 2005లో ప్రభుత్వం రూ.6403కోట్ల అంచనా వ్యయంతో జలయజ్ఞం ద్వారా పరిపాలన అనుమతులు ఇచ్చింది. 2009 వరకు పనులు వేగవంతంగా కొనసాగినప్పటికీ ఆ తరువాత నిధుల కొరత, భూసేకరణ సమస్యలతో నిర్లక్ష్యానికి గురయ్యాయి. 2010నాటికి పూర్తికావాల్సిన పనులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి.

ఈ ప్రాజెక్టుల పరిధిలో ఇప్పటివరకు రూ.7208కోట్లు ఖర్చుచేశారు. అయినా అధికారికంగా ఏ ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు నీళ్లిచ్చిన పరిస్థితి లేదు. నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలో రిజర్వాయర్ల నుంచి చెరువులకు నీళ్లిచ్చారు. మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకంలోనూ మొదటి స్టేజ్‌లో నామమాత్రంగా నీటిని విడుదల చేశారు. భీమా ప్రాజెక్టులోనూ ఇదే పరిస్థితి. జూలై చివరినాటికి(ఖరీఫ్‌కు) పనులను ఆయకట్టుకు నీళ్లిచ్చేలా సిద్ధం చేయాలని నిర్ణయించారు. అయితే ఈ ఏడాది ఎకరా భూమిని కూడా సేకరించలేకపోయారు. దీంతో కీలకమైన పనులు నిలిచిపోయాయి.  

 రాజీవ్ భీమా ఎత్తిపోతల
 రెండోలిఫ్టు ద్వారా 10వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు పనులు పూర్తిచేశారు. భీమా నదిపై ఎత్తిపోతల పథకాన్ని నిర్మించడం ద్వారా, మక్తల్, దేవరకద్ర, తదితర నియోజకవర్గాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉంది. ఈ ప్రాజె క్టు సంగంబండ ఎత్తిపోతల ద్వారా, స్టేజీ-2 కొత్తకోట లిఫ్టు ద్వారా ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు కనీసం 50 నుంచి 60వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో పనులు ప్రారంభించారు. ఖరీఫ్ వరకు పనులు పూర్తిచేసేందుకు రూ.110కోట్లు కేటాయించాలని కోరగా ప్రభుత్వం రూ.83.50కోట్లు మాత్రమే కేటాయించింది.   

 ఎంజీఎల్‌ఐ పథకం
 మొదటి పంప్‌హౌస్ ద్వారా 13వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసి, ఇప్పటికే ట్రయల్న్‌న్రు విజయవంతం చేశారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో మొదటి పంపు ద్వారా నీటి విడుదలను ప్రారంభించారు. వచ్చే ఖరీఫ్ నాటికి ప్రాజెక్టులో పనులు పూర్తి చేసేందుకు ప్రస్తుత పూర్తిస్థాయి బడ్జెట్‌లో రూ.150 కోట్లు కేటాయించాలని అధికారులు ప్రభుత్వానికి నివేదించగా రూ.119కోట్లు మాత్రమే కేటాయించారు.

  నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం
 గుడ్డెందొడ్డి పంప్‌హౌస్‌లో మొదటి పంపు ద్వారా 10వేల ఎకరాలకు సాగునీరు అందేందుకు పనులు పూర్తిచేశారు. ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి అనుబంధ రిజర్వాయర్లకు నీటిని విడుదల చేసే కాల్వలు పూర్తిచేయడంతోపాటు 40వేల ఎకరాల ఆయకట్టుకు ప్రస్తుత ఖరీఫ్ పంటలకు నీటివిడుదల ప్రారంభించారు. అయితే అన్ని రిజర్వాయర్ల కింద డిస్ట్రిబ్యూటరీలు, ఫీడర్ చానల్స్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. పనుల పూర్తికి రూ.100కోట్లు కేటాయించాలని అధికారులు కోరగా.. రూ.79కోట్లు మాత్రమే ఇచ్చారు. వచ్చే ఖరీఫ్ నాటికి రెండులక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించగా పనులు పూర్తికాలేదు.  

 కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకం
 ప్రస్తుతం కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఈ ఖరీఫ్‌లో 25వేల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించే లక్ష్యం నిర్ణయించారు. పనులు పూర్తిచేసేందుకు పూర్తిస్థాయి బడ్జెట్‌లో రూ.25కోట్లు కేటాయించారు.
 
 లక్ష్యం మేరకు నీళ్లిస్తాం..

 నాలుగు ప్రాజెక్టు పరిధిలో ఖరీఫ్‌కు 3.71లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. అవసరమైన పనులకు భూసేకరణ సమస్యగా ఉంది. దీనికితోడు కాంట్రాక్టర్లు జీఓనెం.13 ప్రకారం కొత్త రేట్లు అమలు చేయాలన్న డిమాండ్‌తో పనులు వేగవంతం చేయడం లేదు. ఈ సమస్యలను అధిగమించి వచ్చే సీజన్‌లో నీళ్లిచ్చేందుకు ముందుకు సాగుతున్నాం.
- ఖగేందర్, ప్రాజెక్టుల సీఈ

మరిన్ని వార్తలు