మూడు నదుల ముప్పు

12 Aug, 2019 02:44 IST|Sakshi
నీట మునిగిన హిందూపూర్‌–కృష్ణ రహదారి

కృష్ణా, భీమా, తుంగభద్ర నదుల మహోగ్రరూపం

పాలమూరు నారాయణపేట, జోగులాంబ, వనపర్తి జిల్లాల్లో బీభత్సం 

10 వేల ఎకరాలకు పైగా నీటమునిగిన పంటలు 

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌ : కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. భీమా దూకుడు ప్రదర్శిస్తోంది. వీటికి తుంగభద్ర కూడా తోడయ్యింది. ఈ మూడు ఒక్కటై ఉమ్మడి పాలమూరు జిల్లాపై ముప్పేట దాడికి దిగాయి. ఇప్పటికే నారాయణపేట, జోగులాంబ–గద్వాల, వనపర్తి జిల్లాల్లో కృష్ణానది బీభత్సం సృష్టించింది. వరద ముప్పు 10 వేలకు పైగా ఎకరాలను ముంచెత్తింది. 16 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. కృష్ణ మండల కేంద్రానికి బాహ్యప్రపంచంతో సంబం ధాలు తెగిపోయాయి. అధికారులు 38 గ్రామాల ప్రజలకు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రాంపూర్‌ శివారులోని చేపల చెరువుకు కృష్ణమ్మ పోటెత్తడంతో చెరువు నిర్వాహకుడు వర దలో చిక్కుకుపోయాడు. అధికారులు నాటుపడవ మీద అతన్ని ఒడ్డుకు చేర్చారు. పరీవాహక గ్రామాల్లో ముం పును ఎదుర్కొనేందుకు.. ఆయా జిల్లాల కలెక్టర్లు అధికార యంత్రాంగాన్ని పల్లెల్లో మోహరించారు. వీరు గ్రామాల్లో తిరుగుతూ వరద ఉధృతిపై ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. ఇటు మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అబ్రహం, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తమ పరిధిలో ఉన్న కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో తిరిగి నీటమునిగిన పంటలను పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 

మక్తల్‌ మండలం పస్పుల వద్ద దత్త క్షేత్రంలోకి వచ్చిన వరద నీరు 

పదేళ్ల క్రితం పరిస్థితి పునరావృతం! 
పదేళ్ల తర్వాత నారాయణపూర్‌ ప్రాజెక్టు నుంచి జూరాల ప్రాజెక్టుకు ఇంత భారీమొత్తంలో ఇన్‌ఫ్లో వచ్చింది. 2009 అక్టోబర్‌ 3న 10.19 లక్షల క్యూసెక్కుల వరద రాగా.. సరిగ్గా పదేళ్ల తర్వాత మళ్లీ 8.54 లక్షల ఇన్‌ఫ్లో వచ్చింది. దీంతో ప్రాజెక్టులో ఉన్న 63 క్రస్టు గేట్లలో 62 గేట్లను ఎత్తేశారు.
 
11 గ్రామాలకు ముప్పు.. 
అలంపూర్‌ గొందిమల్లంలో ఉన్న కృష్ణ, తుంగభద్ర సంగమం వద్ద రెండు నదులు ఉగ్రరూపం దాల్చాయి. దీంతో తుంగభద్ర నది పరీవాహక ప్రాంతాలైన ఉండవెల్లి మండలం పుల్లూరు, కలకోట్ల, మిన్నిపాడు, అలంపూర్‌ మండలంలో అలంపూర్, సింగవరం, మానవపాడు మండలం కొరివిపాడు, మద్దూరు, రాజోలి మండలంలో రాజోలి, తూర్పుగార్లపాడు, పడమటి గార్లపాడు, అయిజ మండల పరిధిలోని పుట్కనూరు, రాజాపురం, వేణిసోంపూర్‌ గ్రామాల ప్రజలకు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. 

పంట నీటమునక.. 
గద్వాల మండలం రేకులపల్లి గ్రామశివారులో లోయర్‌ జూరాల కారణంగా 200 ఎకరాల పండ్ల తోటలు, పత్తి, వరి తదితర పంటలు నీట మునిగాయి. ధరూరు మండలం భీంపురానికి చెందిన 150 ఎకరాలలో వరి, పత్తి పంటలు మునిగాయి. ఇటిక్యాల మండలం వీరాపురం, కార్పాకుల, తిమ్మాపురం గ్రామాల్లో 850 ఎకరాల్లో వరి, చెరకు, పత్తి, మిరప, ఉల్లి పంటలు మునిగాయి. పెబ్బేరు మండలం రాంపురం, రంగాపూర్, మునగమాన్‌దిన్నె, పెంచికల పాడు, ఈర్లదిన్నె గ్రామాల్లో వరి, కంది, వేరుశనగ, పంటలతో పాటు వరినారుమడులు నీట మునిగాయి. అమరచింత మండలం నందిమల్లలో 50 ఎకరాల వరి పంట నీట ముని గింది. ఆత్మకూరు మండలంలోని రేచింతల, ఆరేపల్లి, మాలమల్ల, కత్తెపల్లి, తూంపల్లి, జూరాలలో 200 ఎకరాల్లో వరిపంట నీట మునిగినట్లు అధికారుల ప్రాథమిక అంచనా. నారాయణపేట జిల్లా కృష్ణా పరీవాహక మండలాల్లో 4 వేలకు పైగా వరి, పత్తి పంటలు నీటమునిగాయి. కృష్ణ, మాగనూరు మండలాల పరిధిలోని వాసునగర్, హిందూపూర్, మొరహరిదొడ్ది, ముడుమాలు, తంగిడి, పుంజనూరు, మందిపల్లి, కొల్పూరు, గుడెబల్లూరులో 5 వేల ఎకరాల్లో పంట మునిగింది. 

స్తంభించిన రవాణా.. 
కృష్ణ మండల కేంద్రంతో పాటు, వాసునగర్‌ గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. కృష్ణ, హిందూపూర్‌ మధ్యనున్న వంతెన మునిగిపోవడంతో మండల కేంద్రానికి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. హిందూపూర్‌లోని పలు కాలనీలకు రాకపోకలు నిలిచిపోయాయి. జోగులాంబ–గద్వాల జిల్లా ధరూరు మండలంలో చింతరేవుల–భీంపురం అదే మండలం బీరోలు, గుర్రంగడ్డ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయా యి. ఆత్మకూరు మండలంలోని రేచింతలకు రాకపోకలు నిలిచాయి. కృష్ణ మండలం తంగిడిలోని శ్రీదత్తభీమేశ్వర ఆలయాన్ని నీరు చుట్టు ముట్టింది. ఇటిక్యాల మండలం బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద శివాలయం, రామాలయంలోకి వరద చేరింది. మక్తల్‌ మండలంలోని పంచదేవ్‌పహాడ్‌ వద్ద ఉన్న దత్తాత్రేయ స్వామి ఆలయంలోకి వరద వచ్చింది. వరద ముప్పుతో నారాయణపేట, జోగులాంబ–గద్వాల, వనపర్తి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు సహాయక చర్యలు చేపడుతున్నారు.  

హెల్ప్‌లైన్‌ సెంటర్లు.. 
గద్వాల కలెక్టరేట్‌లో 08546–274007, నారాయణపేట కలెక్టరేట్‌లో 08506–283444 హెల్ప్‌లైన్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు