హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం

3 Jun, 2019 17:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సోమవారం సాయంత్రం ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. వీటి ప్రభావంతో నగరంలోని పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్‌, సుచిత్ర, షాపూర్‌, పటాన్‌చెరు, రామచంద్రపురం, అల్వాల్‌, తిరుమలగిరి, ఏఎస్‌ రావునగర్‌, సైనిక్‌పురి, ఈసీఐఎల్‌, ఎల్‌బీ నగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మేట్‌, అత్తాపూర్‌, నార్సింగి, రాజేంద్రనగర్‌లలో భారీ వర్షం పడుతుంది. ఎండ, ఉక్కపోతతో అల్లాడిన నగరవాసులకు వర్షం కాసింత ఉపశమనం కలిగినట్టయింది. 

మరోవైపు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల చెట్లు విరిగి పడ్డాయి. నేరేడ్‌మెట్‌ డిఫెన్స్‌ కాలనీలో ఈదురుగాలులకు చెట్టు విరిగి మీద పడటంతో కారు ధ్వంసమైంది. పలు చోట్ల రోడ్లపై వర్షపు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. దీంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు బయలుదేరిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  రుతుపవనాలు తీరాన్ని తాకనున్న సమయంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు.


కరెంట్‌ షాక్‌తో యువకుని మృతి..
ఎస్సార్‌ నగర్‌ పరిధిలోని సుభాష్‌ నగర్‌లో కరెంట్‌ షాక్‌ తగిలి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.

అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ అధికారులు..
నగరంలో ఆకస్మాత్తుగా వర్షం కురవడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. అన్ని సర్కిల్స్‌ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఆదేశించారు. డీఆర్‌ఎఫ్‌, ఎమెర్జెన్సీ విభాగాలు సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలన్నారు.


 

మరిన్ని వార్తలు