వర్షం @ 6 సెం.మీ

23 Sep, 2019 07:34 IST|Sakshi

నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం  

నాలాలో పడి వ్యక్తి గల్లంతు

సాక్షి, సిటీబ్యూరో: వరుసగా కురుస్తున్న కుండపోత వర్షాలతో గ్రేటర్‌ సిటీ తడిసిముద్దవుతోంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కొండాపూర్‌లో అత్యధికంగా 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రధాన రహదారులపైకి వరద పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. జన జీవనం స్తంభించింది. ఇళ్లలోకి చేరిన వర్షపు నీటిని తొలగించేందుకు పలు బస్తీలవాసులు అవస్థలు పడ్డారు.

నాలాలో పడి వ్యక్తి గల్లంతు
జగద్గిరిగుట్ట: ఆదివారం కురిసిన భారీ వర్షానికి బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ çపరిధిలో ఓ వ్యక్తి నాలాలో పడి గల్లంతయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం... నిజాంపేట్‌లోని పుష్పక్‌ అపార్ట్‌మెంట్‌ సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న ఓ అపార్ట్‌మెంట్‌లో రకీబుల్‌ షేక్‌(36) లేబర్‌గా పని చేస్తున్నాడు. వెస్ట్‌ బెంగాల్‌లోని ఫజిల్‌నగర్‌ నాడియాకు చెందిన రకీబుల్‌ షేక్‌ బతుకుదెరువు నిమిత్తం నిజాంపేట్‌కు వచ్చి ఉంటున్నాడు. కాగా ఆదివారం కురిసిన వర్షానికి వరద పెద్ద ఎత్తున రావడంతో నాలాలు పొంగిపొర్లాయి. వర్షంలో నడుచుకుంటూ వస్తున్న రకీబుల్‌ షేక్‌ ఎదురుగా ఓ కారు వస్తుండగా పక్కకు జరిగే క్రమంలో వరలో పోటెత్తడంతో నాలాను గుర్తించిక అందులో పడి గల్లంతయ్యాడు. ఇది గమనించిన చుట్టుపక్కల వారు అక్కడకు వచ్చి చూసే సరికి ఆ నీటి ప్రవాహంలో అతడు కొట్టుకుపోయాడు. దీంతో రకీబుల్‌ షేక్‌ స్నేహితుడు శిజాన్‌ బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాచుపల్లి సీఐ జగదీశ్వర్‌ ఆధ్వర్యంలో గల్లంతయిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. సంఘటన స్థలానికి మల్కాజిగిరి ఆర్డీవో మధుసూదన్‌ వచ్చి పరిశీలించారు.

>
మరిన్ని వార్తలు