హైదరాబాద్‌లో భారీ వర్షం

24 Sep, 2019 18:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హైదరాబాద్‌ను కుండపోత వర్షం ముంచెత్తింది. నగరంలో మంగళవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తోంది. మధ్య మధ్యలో కాసేపు విరామం ఇచ్చిన రాత్రి వరకు వర్షం పడుతూనే ఉంది. దీంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ఉద్యోగులు ఇళ్లకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై భారీగా నీరు చేరడంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఓ వైపు ట్రాఫిక్‌ జామ్‌, మరోవైపు వర్షం పడుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. రోడ్లను వరద ముంచెత్తడంతో.. కొన్ని చోట్ల టువీలర్లు కొట్టుకుపోయాయి. 

భారీ వర్షం కురుస్తుండటంతో జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు. అలాగే రోడ్లపై చేరిన నీటిని తొలగించేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న మేయర్‌ బొంతు రామ్మోహన్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి లోతట్టు ప్రాంతాల పరిస్థితులను పరిశీలిస్తున్నారు. రాత్రి 10 గంటల వరకు కవాడిగూడలో 7.4, నాంపల్లిలో 7, బంజారాహిల్స్‌లో 6.7, ఖైరతాబాద్‌లో 6.6, తిరుమలగిరిలో 6.2, కాప్రాలో 5.9, సికింద్రాబాద్‌లో 5.8 సెం.మీల వర్షపాతం నమోదైంది. 


భారీ వర్షం నేపథ్యంలో తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి వాహనదారులకు పలు సూచనలు చేశారు. రోడ్లపై భారీగా నీరు ఉన్నందున.. వాహనదారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వారికి ఏదైనా సమస్య తలెత్తితే 100కి ఫోన్‌ చేసి సమాచారమివ్వాలని సూచించారు. అలాగే వాహనదారులు తమ ఇళ్లకు క్షేమంగా చేరుకోవడానికి పోలీసులు తగిన సహాయం అందించాలని ఆదేశించారు.

(హైదరాబాద్ ను కుదిపేసిన జడివాన.. దృశ్యాల కోసం... క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు