క్యుములోనింబస్‌ కుమ్మేసింది

7 Oct, 2019 10:38 IST|Sakshi
ఎన్‌సీసీ గేట్‌ వద్ద భారీ వర్షం

నిండా మునిగిన గ్రేటర్‌సిటీ  

విరిగిపడిన భారీ చెట్లు..పలు చోట్ల వాహనాలు ధ్వంసం..రాకపోకలకు అంతరాయం..

ఉప్పొంగిన నాలాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం..

ఇళ్లలోకి చేరిన వర్షపునీటిని

తొలగించేందుకు స్థానికుల అవస్థలు..

సాక్షి, సిటీబ్యూరో: ఉపరితల ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావానికి తోడు కొన్ని ప్రాంతాల్లో ఉద్ధృతంగా కమ్మేసిన క్యుములోనింబస్‌ మేఘాలు మరోసారి సమ్మిళితమై కుమ్మేయడంతో ఆదివారం రాజధాని గ్రేటర్‌సిటీ నిండా మునిగింది. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల ప్రాంతంలో అత్యధికంగా జగద్గిరిగుట్టలో 9.6 సెంటీమీటర్ల మేర కుంభవృష్టి కురిసింది. గాజులరామారంలో 9.2, షాపూర్‌నగర్‌లో 8.5, సుభాష్‌నగర్‌లో 7.3 సెంటీమీటర్ల జడివాన కురిసింది. వర్షబీభత్సానికి నగరంలోని ప్రధాన రహదారులు ఉగ్రరూపం దాల్చి ఉప్పొంగడంతో సమీపంలోని బస్తీలు నిండా మునిగాయి. నల్లకుంట ప్రాంతంలో నాగమయ్య కుంట పొంగి సమీపంలోని పద్మ కాలనీలోని ఇళ్లలోకి వరదనీరు ప్రవేశించింది. ఇళ్లలోకి చేరిన వర్షపునీటిని తొలగించేందుకు స్థానికులు నానా అవస్థలు పడ్డారు. మారేడ్‌పల్లి, ఇసామియాబజార్‌ తదితర ప్రాంతాల్లో భారీ చెట్లు నేలకూలడంతో చెట్ల కింద పార్కింగ్‌ చేసిన వాహనాలు ధ్వంసమయ్యాయి. రహదారులపై విరిగిపడిన చెట్ల కారణంగా రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీటమునగడంతో జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌రెస్పాన్స్‌ బృందాలు రంగంలోకి దిగి సహాయకచర్యలు చేపట్టాయి. రాగల 24 గంటల్లో నగరంలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. నగరంలో సాయంత్రం 6 గంటల వరకు పలు ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాలిలా ఉన్నాయి...

వరదనీటిలో ధరణినగర్‌
ఆల్విన్‌కాలనీ: చిన్నపాటి వర్షానికే కూకట్‌పల్లి ఆల్విన్‌కాలనీ ధరణినగర్‌ అస్తవ్యస్తంగా మారింది. గత రెండేళ్ల క్రితం విరామం లేకుండా కురిసిన వర్షాలకు ధరణినగర్‌లో నెల రోజుల పాటు నీటిలో మునిగిపోయి జనజీవనాన్ని అతలాకుతలం చేసింది.  ఆదివారం మధ్యాహ్నం కురిసిన వర్షం కారణంగా ధరణినగర్‌లోకి స్థానికంగా ఉన్న పరికి చెరువు నాలా ఉప్పొంగింది. రసాయన వ్యర్థాలతో కూడిన నురుగుతో ప్రవహించటంతో స్థానికులు బెంబేలెత్తారు. ఇళ్లల్లోకి నీరు రావడం వాహనాలు మనిగిపోవటంతో ఆస్తినష్టం వాటిల్లినట్లు స్థానికులు పేర్కొన్నారు. అధికారుల పర్యవేక్షణలోపం కారణంగానే ప్రతి సంవత్సరం ఈ సమస్య పునరావృతం అవుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ.6 కోట్ల రూపాయలు నాలాకు ఇరువైపులా కంచెగోడలు నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి సుమారు సంవత్సరం గడుస్తున్నా అడుగు కూడా ముందుకు పడడం లేదు. నాలాకు అడ్డుగా వస్తున్నాయని ఇళ్లకు నోటీసులు అందజేసి కొన్ని ఇళ్లను కూల్చివేసినా వారికి కూడా పరిహారం చెల్లించకుండా కాలయాపన చేయబట్టే ఈ దుస్థితి నెలకొందని స్థానికులు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు