వానొచ్చే..

20 Mar, 2020 08:39 IST|Sakshi
సత్యరాఘవేంద్రకాలనీలో వడగళ్లను చూపిస్తున్న మహిళ

ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం

సిటీలో బీభత్సం సృష్టించిన వడగళ్లు

తిరుమలగిరిలో 2.5 సెం.మీ వర్షపాతం

నేలకొరిగిన వృక్షాలు, విరిగిపడిన కొమ్మలు

సాక్షి, సిటీబ్యూరో/బంజారాహిల్స్‌: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో నగరంలో గురువారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, భారీ ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. పశ్చిమ విదర్భ, దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం, ఉత్తర ఇంటీరియర్, తమిళనాడు, కర్ణాటక మీదుగా 0.9 కి.మీ ఎత్తువరకు ఉపరితల ద్రోణి ప్రభావంతో వడగళ్ల వర్షం కురిసినట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ పేర్కొంది. ఈదురుగాలుల బీభత్సానికి జూబ్లీహిల్స్‌ రోడ్‌నెం.10లో రోడ్డుపై భారీ వృక్షం ఒక్కసారిగా కుప్పకూలడంతో ఓ కారు ధ్వంసమైంది. కారులో ప్రయాణిస్తున్న వారికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. 

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్‌ ప్రాంతాల్లో అర్ధగంట పాటు దంచి కొట్టిన వానతో రహదారులు నీటమునిగాయి. 16 చోట్ల చెట్లతో పాటు, కొమ్మలు విరిగిపడ్డాయి. ఫిలింనగర్‌లో 8 చోట్ల కొమ్మలు విరిగిపడడంతో రాకపోకలు స్తంభించాయి. పలు చోట్ల వరదనీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అత్యధికంగా తిరుమలగిరిలో 2.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మల్కాజిగిరి తదితర ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. ముషీరాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, ఎల్బీనగర్‌ తదితర ప్రాంతాల్లో సెంటీమీటరు మేర వర్షపాతం నమోదయ్యింది. రానున్న 24 గంటల్లో నగరంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

మరిన్ని వార్తలు