నగరంలో అర్థరాత్రి దంచికొట్టిన వాన

27 Sep, 2019 07:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో మరోసారి వర్షం దంచి కొట్టింది. అర్ధరాత్రి నుంచి ఆకస్మికంగా భారీ వర్షం కురవడంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.  లింగంపల్లి, మియాపూర్‌, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్‌, గుడిమల్కాపూర్, రెడ్ హిల్స్, నాంపల్లి, శ్రీనగర్ కాలనీ, జూబ్లీహిల్స్, కార్వాన్, ఆసిఫ్‌ నగర్ లతోపాటు అనేక ప్రాంతాల్లో 14 సె.మీ నుంచి 10 సె.మీటర్ల వర్షపాతం నమోదైంది. అనేక కాలనీలోకి నీరు చేరడంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. వర్ష భీభత్సానికి చాలా ప్రాంతాల్లో చెట్లు కూలాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు చేరుకొని కూలిన చెట్లను రోడ్లపై నుంచి తొలగించాయి.

హుస్సేన్ సాగర్ లోకి వెళ్లే మక్త నాలా ప్రహారీ గోడ కూలడంతో రాజ్ భవన్ ఎదురుగా ఉన్న మదర్సా  మక్త ( ఎం.ఎస్ మక్తా) బస్తీలోకి భారీగా వరదనీరు చేరింది. దాదాపు 200 కు పైగా ఇల్లు జలమయమయ్యాయి. సమాచారం తెలుసుకున్న వెంటనే నగర మేయర్ బొంతు రామ్మోహన్ డిజాస్టర్ రెస్క్యూ బృందాలకు సమాచారం అందించి తెల్లవారుజామున నాలుగు గంటలకు ఎం.ఎస్‌ మక్త కు చేరుకున్నారు. రెండు డిజాస్టర్ రిలీఫ్ బృందాలతో పాటు మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు అందిస్తున్న సహాయక చర్యలను మేయర్‌ సంఘటన స్థలంలోనే ఉండి స్వయంగా పర్యవేక్షించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, జోనల్ కమిషనర్లు, విజిలెన్స్ డైరెక్టర్  విశ్వజిత్ కంపాటిలతో  టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులను అప్రమత్తం చేశారు. 

మరిన్ని వార్తలు