వర్ష బీభత్సం..

27 Apr, 2020 08:28 IST|Sakshi
పటేల్‌నగర్‌లో ఒరిగిన చెట్టు

పాతబస్తీ అతలాకుతలం

గాలిదుమారానికి నేలకొరిగిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు

ప్రహరీ కూలి ఇద్దరికి గాయాలు  

చాంద్రాయణగుట్ట/యాకుత్‌పురా/దూద్‌బౌలి:  పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి  చెట్ల కొమ్మలు, సెల్‌ టవర్లు కూలిపోయాయి. దీంతో ఒక్కసారిగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విద్యుత్‌ స్తంభాలు, తీగలు పడిపోవడంతో కరెంట్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. భవానీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నిర్మాణంలో ఉన్న ప్రైవేటు స్కూల్‌ భవనం పైనుంచి ఇటుకలు, పెచ్చులూడటంతో కింద ఉన్న రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ఉప్పుగూడ ఆర్‌యూబీ బ్రిడ్జి సమీపంలో ఓ ఇంటిపై నుంచి జియో సెల్‌ టవర్‌ కూలి పడిపోయింది.గౌలిపురా పటేల్‌నగర్, ఛత్రినాక ఎస్సార్టీ కాలనీ, శ్రీరాంనగర్‌ ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి.ఛత్రినాక నుంచి ఉప్పుగూడ ఆర్‌యూబీ వెళ్లే ప్రధాన రోడ్డు, లలితాబాగ్‌ రైల్వే బ్రిడ్జి పరిసరాల్లో వర్షపు నీరు పెద్ద ఎత్తున రోడ్డుపై నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉప్పుగూడలోని సిటీ స్పిరిట్‌ స్కూల్‌ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి ఇటుకలు పక్కనే ఉన్న రేకులపై పడటంతో స్వల్పంగా పగిలాయి.  

హుస్సేనీఆలంలో ప్రహరీ కూలి ఇద్దరికి గాయాలు  
భారీ వర్షానికి నిర్మాణంలో ఉన్న భవనానికి సంబంధించిన ప్రహరీ కూలి పక్కింటిపై పడటంతో ఇద్దరికి  గాయాలకు  సంఘటన హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. దూద్‌బౌలి హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్‌ పక్కన నిర్మాణంలో ఉన్న భవన ప్రహరీ కూలడంతో పక్కనే ఉండే జైనాబ్‌ బేగం,    మహ్మద్‌ అక్తర్‌లకు గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న హుస్సేనీఆలం ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌ కొత్వాల్‌ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.   

ఎండా..ఠండా
 ఒక వైపు వర్షం.... మరో వైపు ఎండలతో నగరంలో భిన్నమైన వాతావరణం నెలకొంది. నిండు వేసవి వస్తుండటంతో నగరంలో క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆదివారం నగరంలో 39 డిగ్రీల సగటు ఉష్ణోగ్రత నమోదు కాగా,  అత్యధికంగా సీతాఫల్‌మండిలో 41.3 డిగ్రీలు నమోదైంది. మరోవైపు సాయంత్రానికి వాతావరణం చల్లబడి నగరంలో పలు చోట్ల గాలిదుమారంతో కూడిన వర్షం కురిసింది. నగరంలో అత్యధికంగా బండ్లగూడ లలితాబాగ్‌లో 20.5 మి.మీల వర్షపాతం నమోదైంది. చందూలాల్‌ బారాదరి, దూద్‌బౌలి, ఉప్పుగూడ విరాసత్‌నగర్, కిషన్‌బాగ్, కంచన్‌బాగ్, జుమ్మేరాత్‌బజార్, అత్తాపూర్, చాంద్రాయణగుట్ట, కార్వాన్‌లతో పాటు నగర శివారు ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. 

మరిన్ని వార్తలు