హాయి..హాయిగా..

2 May, 2020 07:32 IST|Sakshi
కర్మన్‌ఘాట్‌లో..

గ్రేటర్‌లో పలుచోట్ల భారీ వర్షం..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం..

రాగల 24 గంటల్లో వర్షసూచన..

మేనెల తొలి రోజున పలకరించిన చల్లటివాన...

ఏప్రిల్‌ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఎండలే.. భానుడి దెబ్బకు బయటకు అడుగుపెట్టాలంటే భయమేస్తుంది. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌ నెల మాత్రం పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. గత ఐదేళ్లతోపోలిస్తే
ఈ సంవత్సరం ఎండలు తక్కువగానే నమోదయ్యాయి. ఇక మే మాసం ప్రారంభం రోజే వర్షం నగరాన్ని తడిచి ముద్దచేసింది. శుక్రవారంకురిసిన వర్షానికి నగరవాసి ఉపశమనం పొందాడు.

సాక్షి,సిటీబ్యూరో:  నగరవాసులకు ఏప్రిల్‌ మాసమంతా కూల్‌గానే గడిచిపోయింది. గడిచిన నాలుగేళ్లలో అతి తక్కువ పగటి పూట ఉష్ణోగ్రతలు ఈ సంవత్సరం నమోదయ్యాయి. కోవిడ్‌ మోసుకొచ్చిన ‘లాక్‌డౌన్‌’తో ఇంటికే పరిమితం కావాల్సి వచ్చినా..వేసవి తాపం పెద్దగా లేకపోవటంతో ఏసీ,కూలర్ల వినియోగం పెద్దగా పెరగనే లేదని విద్యుత్‌ వినియోగం లెక్కలు చెబుతున్నాయి.గతంతో పోలిస్తే ఏప్రిల్‌ మాసంలో వడగాలుల తీవ్రత కూడా ఈ మారు నమోదు కాలేదు. వేసవి సీజన్‌లో అత్యధికంగా సాధారణ డిగ్రీల కంటే తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్‌ మాసంలో అత్యధిక ఉష్ణోగ్రత 2017,18 సంవత్సరాల్లో ఏప్రిల్‌ మూడో వారంలో 43 డిగ్రీలుగా నమోదు కాగా ఈ యేడు మాత్రం ఏప్రిల్‌ 23,24 తేదీల్లో అత్యధిక ఉష్ణోగ్రత 40.7 డిగ్రీలుగా నమోదైంది.ఇక మధ్యంలో ఉపరితల ద్రోణి ఫలితంగా నగరంలో మూడు రోజుల పాటు వర్షాలు కూడా కురవటంతో వేసవి తాపం జనాలపై కనిపించకుండా పోయింది. గడిచిన ఐదేళ్లతో పోలిస్తే ఈ మారే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. 

హీట్‌వేవ్‌లు తక్కువే..
నగరంలో ఉష్ణోగ్రత 41 డిగ్రీలు దాటితే కాలుష్య ఉద్గారాలు, అల్ట్రావైలెట్‌ రేడియేషన్‌ తదితర కారణాలతో వడగాలులు వీచేందుకు అవకాశం ఉంది. 2019లో రాష్ట్రంలో 44 రోజులు, 2018లో ఏడు రోజుల పాటు వడగాలుల వీచాయి. అయితే ఈ మారు ఏప్రిల్‌లో ఒక్క రోజు కూడా వడగాలి లేకపోగా, మే మాసంలో కూడా తీవ్రత తక్కువేనని వాతావరణ శాఖ అభిప్రాయపడుతోంది.

 భగభగమని భానుడు విజృంభించే మే నెల తొలిరోజున గ్రేటర్‌ను చల్లటివాన పలకరించింది. దక్షిణ అండమాన్‌ సముద్రం, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో శుక్రవారం ఉదయం అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా 4.5 కి.మీ ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు పేర్కొంది. రాగల 48 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశాలున్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో నగరంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు ప్రకటించింది. కాగా శుక్రవారం ఉదయం, మధ్యాహ్నం భానుడు ప్రతాపం చూపగా..మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఒక్క సారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు,  మెరుపులు,ఈదురుగాలులు వీచి పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా అల్కాపురిలో 2.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా