రైతన్నకు ‘అకాల’ దెబ్బ

14 Dec, 2018 00:27 IST|Sakshi

ఉమ్మడి కరీంనగర్,  ఆదిలాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షం

తడిసిన ధాన్యం..  ముద్దయిన పత్తి 

లబోదిబోమంటున్న   అన్నదాతలు 

సాక్షి, నెట్‌వర్క్‌: ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో గురువారం అకాలవర్షం అన్నదాతలను దెబ్బతీసింది. భారీ వర్షం కురవడంతో వరిధాన్యం నీటిపాలుకాగా, పత్తి తడిసి ముద్దయింది. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. అల్పపీడన ప్రభావంతో బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు కురిసిన వర్షం రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరిధాన్యం, కోతకు వచ్చిన వరిపంట, కల్లాల్లో ఆరబోసిన ధాన్యం నీటిపాలైంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు తడవకుండా ఉండేందుకు రైతులు« ఎన్ని కవర్లు కప్పినా ఫలితం లేకుండా పోయింది. సుమారు ఐదు వేల మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిపోయింది. పొలాల్లో కోసి ఉన్న వరి మెదలు నీటిలో మునిగిపోయాయి. మరోవైపు ఏరేందుకు సిద్ధంగా ఉన్న పత్తి, ఇంటి ఆవరణలో నిల్వ ఉంచిన పత్తి తడిసి ముద్దయింది.

అధికారుల నిర్లక్ష్యంతోనే ధాన్యం రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో ఉండాల్సి వచ్చిందని, ఇప్పుడు వర్షంలో తడిసిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరబెట్టి తీసుకొచ్చినా తేమ సాకుతో, గన్నిసంచుల కొరత, లారీలు రావడం లేదని రకరకాల కారణాలతో పదిరోజులు వరకు కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ ఉంచాల్సి వచ్చిందని, వర్షంలో ధాన్యం తడిసిందని  రైతులు వాపోతున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల్లో రైతులకు అధికంగా నష్టం జరిగింది. అలాగే.. జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, కథలాపూర్, మేడిపల్లి, ధర్మపురి, గొల్లపల్లి, వెల్గటూర్‌ ప్రాంతాల్లో సుమారు 20 వేల క్వింటాళ్ల వరకు ధాన్యం ఈ కాల వర్షానికి తడిసిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట, బోయినపల్లి తదితర మండలాల్లోనూ ఇదే పరిస్థితి. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి, మానకొండూర్, సైదాపూర్‌ మండ లంలో పంటలకు నష్టం వాటిల్లింది. వర్షంతోపాటు ఈదురుగాలుల ప్రభావంతో మొక్కజొన్న నువ్వుల పంటలు నేలకొరిగాయి. పెద్దపల్లి జిల్లాలో కురిసిన వర్షానికి గోదావరిఖనిలోని పలు ఇళ్లలోకి నీరు చేరింది.  

మరిన్ని వార్తలు