కడగండ్లు మిగిల్చిన అకాల వర్షం

10 Apr, 2020 02:50 IST|Sakshi

పలు ప్రాంతాల్లో నేలకొరిగిన వరిపంట

వడగళ్ల వానతో రాలిన మామిడి

కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం

విద్యుత్‌ స్తంభాలు కూలి సరఫరాకు అంతరాయం

సాక్షి, నెట్‌వర్క్‌: రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గురువారం కురిసిన అకాల వర్షాలు రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. కోత కు వచ్చిన వరి పైర్లు నేలకొరిగాయి. కొన్ని చోట్ల మామిడి తోట లకు నష్టం వాటిల్లింది. ఇతర పంటలు కూడా దెబ్బతిన్నాయి. 
 ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాల్వంచ, అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట, మణుగూరు, అశ్వాపురం, సత్తుపల్లి మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తో పాటు కల్లాల్లోని మిర్చి, మొక్కజొన్న పంట తడిసిపోయిం ది. కొన్నిచోట్ల మామిడి కాయలు నేలరాలాయి.
సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. కొమురవెళ్లి మండలంలో వడగళ్లు పడ్డాయి. నంగునూరులో ధాన్యం నేలరాలింది. గజ్వేల్‌ మండలంలో వరి, మామిడితోటలకు నష్టం జరిగింది.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నష్టం అపారం
యాదాద్రి భువనగిరి జిల్లాలో రాజాపేట, తుర్కపల్లి మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లిం ది. రాజాపేట మండలంలో మామిడి తోటలు దెబ్బతినగా తు ర్కపల్లి మండలంలో మామిడి తోటలతో పాటు వరికి తీరని నష్టం వాటిల్లింది. విద్యుత్‌æ స్తంభాలు కూలిపోవడంతో కరెంట్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గాలులకు పలు చోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరి పడ్డాయి. చెట్లు కూలిపోయాయి. కోతకు వచ్చి న వరి పంట 2,963 ఎకరాల్లో పూర్తిగా ధ్వంసమైంది. నిమ్మ, మామిడి, కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. ఇక నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలో వడగండ్లతో కూడిన వర్షం కురవడంతో చేతికొచ్చిన వరిపైరు పూర్తిగా నేలపాలైంది. చింతపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో వసతులు లేకపోవడంతో ధాన్యం నీటిపాలైంది. అలాగే వింజమూరు, వర్కాల గ్రామాల్లో వరి పైరుకు తీవ్ర నష్టం వాటిల్లింది.

ఉమ్మడి పాలమూరులో భారీ నష్టం.. : మహబూబ్‌నగర్‌ జిల్లాలోని చిన్నచింతకుంట, మూసాపేట, అడ్డాకుల, రాజాపూర్, మహబూబ్‌నగర్‌ రూరల్, బాలానగర్‌ మండలాల్లో దాదాపు వెయ్యి ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని అంచనా. వనపర్తి జిల్లాలో రెండు గంటల పాటు భారీ వర్షం కురవడంతో పంటలకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. కొత్తకోట, వనపర్తి, పెద్దమందడి మం డలాల్లో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. శుక్రవారం ఉద్యాన, వ్యవసాయ శాఖ అధికారులు నష్టం వివరాల ను అంచనా వేయనున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్‌ మం డలంలోని ఖానాపూర్, పంచలింగాల, కర్ని, రుద్రసముద్రం, కాట్రెవ్‌పల్లి, మక్తల్‌ గ్రామాల్లో వెయ్యి ఎకరాల్లో పంట నేల వాలింది. నర్వ మండలం కొత్తపల్లి, జక్కన్నపల్లి, రాయికోడ్, నర్వ, యాంకి గ్రామాల్లో వడ్లు రాలిపోగా.. మామిడి తోటలు దెబ్బతిన్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లా చింతరేవుల, నర్సన్‌దొడ్డి, రేవులపల్లి, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో వడగండ్ల వానతో పండ్ల తోటలు దెబ్బతిన్నాయి.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం
ఉపరితల ద్రోణి ప్రభావంతో గురువారం గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సాయంత్రం వేళ కురిసిన వర్షానికి పలు ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు పోటెత్తింది. తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని.. తూర్పు విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో నగరంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు ప్రకటించింది. కాగా అత్యధికంగా బొల్లారంలో 3.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

క్యాంప్‌ ఆఫీస్‌పై పిడుగు.. దేవరకొండ ఎమ్మెల్యేకు తప్పిన ముప్పు
నల్లగొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రనాయక్‌ క్యాంప్‌ కార్యాలయం పెంట్‌హౌస్‌æ ప్రహరీపై గురువారం పిడుగుపడింది. పిడుగుపాటుకు క్యాంప్‌ కార్యాలయం పెంట్‌హౌస్‌ ప్రహరీ గోడ పాక్షికంగా దెబ్బతిన్నది. ఆ సమయంలో ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో కుటుంబసభ్యులతో కలసి భోజనం చేస్తున్నారు. ఎమ్మెల్యే, ఆయన కుటుంబసభ్యులు సురక్షితంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా