రాజధానిలో భారీ వర్షం

14 Jul, 2020 03:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అల్పపీడన ద్రోణి ప్రభావంతో సోమవారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. బండ్లగూడలో అత్యధికంగా 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాయం త్రం 4 గంటల ప్రాంతంలో వర్షం మొదలై అర్ధరాత్రి వరకు పలుదఫాలుగా కుంభవృష్టి కురిసింది. వర్ష బీభత్సానికి పలు ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. కొత్తపేట్, మలక్‌పేట్, కోఠి తదితర ప్రాంతాల్లో నడుములోతున వరదనీరు పోటెత్తి, ట్రాఫిక్‌ స్తంభించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. 

రాష్ట్రంలోని అనేక చోట్ల సోమవారం మోస్తరు వానలు కురిశాయి. యాదాద్రి భువన గిరి జిల్లాలోని వెంకిర్యాలలో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయ్యింది. పెద్దపల్లిలోని సుగ్లాంపల్లిలో 7, మహబూబాబాద్‌ గూడూరులో 6.5, కరీంనగర్‌లోని తంగుల, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా బండ్లగూడలో 6, నల్లగొండలోని కనగల్‌లో 5, రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్, వరంగల్‌ రూరల్‌లోని మంగళ వారిపేటలలో 4.8, మంచిర్యాలలోని కొమ్మెరలో 4.7, నల్లగొండ జిల్లా ముల్కచర్లలో 4.6, హైదరాబాద్‌ నాంపల్లిలో 4.6, రంగారెడ్డిలోని తాటిఅన్నారం, రెడ్డిపల్లెలలో 4.5, హైదరాబాద్‌ బహదూర్‌పురలో 4.3, చార్మినార్‌లో 4.2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.  

నేడు, రేపు భారీ వర్షాలు  
ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తా ఆంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మంగళవారం ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం –ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది.  

>
మరిన్ని వార్తలు