మరో మూడు వారాలు వర్ష గండం

3 Oct, 2019 12:42 IST|Sakshi

లేటైనా లేటెస్ట్‌ రికార్డ్‌

పదేళ్ల తర్వాత మళ్లీ అదనపు వర్షం

వీఐపీ, ఐటీ జోన్లు అతలాకుతలం

బంజారాహిల్స్‌ టాప్‌.. పటాన్‌చెరు లాస్ట్‌

దుర్గంచెరువు ఫుల్, వరదలో నెక్టార్‌ గార్డెన్‌

మరో మూడు వారాలు వర్షాలకు చాన్స్‌!

సాక్షి,సిటీబ్యూరో: రుతుపవనాలు ఈ ఏడాది రావడం ఆలస్యమై.. వర్షాలు అనుకున్న స్థాయిలో కురవకపోయినా.. తిరిగి వెళ్లేటప్పుడు మాత్రం ఫుల్‌ ఎఫెక్ట్‌ను చూపుతున్నాయి. ఈ ఏడాది గ్రేటర్‌ మహానగరంలో వర్షం చిత్ర విచిత్రంగా కురవడంతో పాటు గడిచిన పదేళ్లలో లేని రికార్డును సైతం నెలకొల్పింది. ఒక మేఘం మరో మేఘంతో మిళితమై ‘క్లౌడ్‌ బరస్ట్‌’తో కుండపోతగా కురిశాయి. పటాన్‌ చెరులో మాత్రం సాధారణ సగటు వర్షపాతంకూడా నమోదవకుండానే మేఘాలు జారుకుంటున్నాయి. అయితే, నగరంలో వీవీఐపీలు నివాసముండే బంజారాహిల్స్, జూబ్లిహిల్స్‌తో కలిసి ఉన్న షేక్‌పేట మండలంలో ఈసారి 542.4 మి.మీ వర్షం కురుస్తుందని భావిస్తే ఏకంగా 815.9 మి.మీ వర్షం పడి రికార్డు సృష్టించింది.

అంటే అంచనా వేసినదానికంటే 50 శాతం అధికంగా నమోదైంది. ఆసిఫ్‌నగర్‌ మండలంలోనూ ఆశించిన దానికంటే 50 శాతం అధిక వర్షం కురిసింది. ఐటీ పరిశ్రమలకు ఆయువుపట్టుగా ఉన్న శేరిలింగంపల్లి మండలంలోనూ 575.1 మి.మీ సాధారణ వర్షపాతం నమోదవుతుందనుకుంటే.. ఇక్కడ 767.3 మి.మీ కురిసి 33 శాతం అధికంగా నమోదైంది. ఇదే తరహాలో ఆసిఫ్‌నగర్‌లో 50 శాతం, కాప్రాలో 41, ఖైరతాబాద్‌లో 36, నాంపల్లిలో 35, చార్మినార్‌లో 29, బాలానగర్‌లో 25, కూకట్‌పల్లిలో 22 శాతం అత్యధిక వర్షపాతం నమోదైంది. పదేళ్ల తర్వాత జీహెచ్‌ఎంసీ పరిధిలో పటాన్‌చెరు, బండ్లగూడ మినహా 16 ప్రాంతాల్లో ఎక్సెస్, మిగిలిన అంతటా సాధారణ సగటును మించి వర్షం కురిసింది. రెండు రోజుల క్రితం మాదాపూర్‌లో 73.5 మి.మీ జూబ్లిహిల్స్‌లో 70.5 మి.మీ, ఖాజాగూడలో 69.3 మి.మీ వర్షం కురిసింది. రాష్ట్రంలోనే ఈ మూడు ప్రాంతాల్లో అధిక వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.

వరదనీటితో నెక్టార్‌ గార్డెన్‌  

వరుస కుండపోత వర్షాలతో దుర్గం చెరువు నిండు కుండలా మారింది. సోమవారం 45 నిమిషాల పాటు కుండపోతగా కురిసిన వానతో ఈ చెరువు నీటి మట్టం అడుగు మేర పెరిగింది. మరో అడుగు నిండితే ట్యాంక్‌ పూర్తిగా నిండపోతుంది. చెరువు పూర్తిగా నిండితే ఇనార్బిట్‌ మాల్‌ రహదారిలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. దుర్గం చెరువును ఆనుకొని ఉన్న నెక్టార్‌ గార్డెన్‌ను బ్యాక్‌ వాటర్‌ వెంటాడుతోంది. చెరువులో నీటి మట్టం పెరిగేకొద్దీ బ్యాక్‌ వాటర్‌ నాలాలు, డ్రైనేజీ లైన్లలోకి వెళుతుంది. మ్యాన్‌ హోల్‌ నుంచి బ్యాక్‌ వాటర్‌ పొంగడంతో వర్షానికి వచ్చే వరద రోడ్లపైనే ఉంటుంది. చెరువులో నీటి మట్టం తగ్గితేనే రోడ్లపై నీరు వెళుతుంది. 2003లో భారీ వర్షానికి నెక్టార్‌ గార్డెన్‌ ముందు నుంచి వెళ్లే ఇనార్బిట్‌ మాల్‌ రోడ్డు నీట మునిగింది. 16 ఏళ్ల తరువాత సోమవారం కుండపోతగా కరిసిన వర్షం దాటికి దుర్గం చెరువు నీటి మట్టం అమాంతం పెరిగింది. దీంతో బ్యాక్‌ వాటర్‌ నాలాలు, డ్రైనేజీ లైన్ల నుంచి పొంగింది. బ్యాక్‌ వాటర్, భారీ వర్షంలో వచ్చిన వరద రోడ్లపైనే చేరింది. దీంతో నెక్టార్‌ గార్డెన్‌ రోడ్డులో నాలుగు అడుగుల మేర వరద నీరు చేరింది. ఈ వరదలో కార్లు సైతం మునిగిపోయాయయి. బ్యాక్‌ వాటర్, వరద నీటి ధాటికి నెక్టార్‌ గార్డెన్‌ ప్రహరీ కుప్పకూలింది. వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

నిండు కుండలా దుర్గం చెరువు 
నెక్టార్‌ గార్డెన్‌కు నోటీసులు
నెకార్ట్‌ గార్డెన్‌ అసోసియేషన్‌కు సెప్టెంబర్‌ 27న శేరిలింగంపల్లి సర్కిల్‌–20 టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. వరద నీరు వస్తే ప్రమాదం పొంచి ఉందని.. మూడు రోజుల్లో ఖాళీ చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు.  అంతేకాకుండా అమర్‌ సొసైటీ, కావూరిహిల్స్‌లో ముంపునకు గురయ్యే ఇళ్లను గుర్తించి నోటీసులు జారీ చేస్తామని అధికారులు తెలిపారు. మరో భారీ వర్షం వస్తే దుర్గం చెరువు పూర్తిగా నిండి మ్యాన్‌ హోళ్ల నుంచి వచ్చే బ్యాక్‌ వాటర్, వరద నీటితో నెక్టార్‌ గార్డెన్, అమర్‌ సొసైటీ, కావేరిహిల్స్, సైలెంట్‌ వ్యాలీకి వరద ప్రమాదం తప్పదు.

మరో మూడు వారాలు వర్షగండం
నగరానికి మరో మూడు వారాల పాటు వర్షం ముప్పు ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ఎక్సెస్‌ వర్షం కురవగా మరో మూడు వారాల వరకు రుతుపవనాల ప్రభావం ఉండే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ డైరెక్టర్‌ వీకే రెడ్డి తెలిపారు. దేశం నుంచి రుతుపవనాల ఉపసంహరణ ఇంకా ప్రారంభం కాలేదని, దీంతో నగరంలో మరిన్ని వర్షాలకు ఛాన్స్‌ ఉందని చెప్పారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మ్యాన్‌కైండ్‌ ఫార్మా భారీ విరాళం

పారిశుధ్య కార్మికులకు కరోనా ఎఫెక్ట్!

త్వరలోనే ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల షెడ్యూల్‌

‘కరోనా భయంతో అనవసర మందులు వాడొద్దు’

జిల్లాలో కలకలం రేపిన తొలి ‘కరోనా’ కేసు

సినిమా

అందుకే మేం విడిపోయాం: స్వరభాస్కర్‌

క‌రోనా వార్డులో సేవ‌లందిస్తోన్న న‌టి

మరోసారి బుల్లితెరపై బిగ్‌బాస్‌

ప్రభాస్‌, బన్నీ మళ్లీ ఇచ్చారు!

కరోనా: హీరో విజయ్‌ ఇంటిలో ఆరోగ్యశాఖ తనిఖీ

ఈసారైనా నెగెటివ్ వ‌స్తే బాగుండు: సింగ‌ర్‌