బీ(ధీ)మా కల్పించేనా..!

23 Aug, 2018 11:08 IST|Sakshi
జైనథ్‌ మండలం కామాయిలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పత్తి పంట

సాక్షి, ఆదిలాబాద్‌: జిల్లాలో భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున పంట నష్టం సంభవించింది. ప్రధానంగా పత్తి, సోయా పంటలను పూర్తిగా కోల్పోయిన రైతాంగం కుదేలైంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పంటకు సంబంధించి ప్రాథమిక అంచనాలు వేసినప్పటికీ త్వరలో పూర్తిస్థాయి సర్వే నిర్వహిస్తామని ప్రకటించింది. ఒకవేళ ఈ సర్వే నిర్వహించి నివేదిక పంపినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహారం విడుదల అవుతుందా.. లేదా అనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో రైతులకు బీమానే ధీమా ఇవ్వాల్సింది. గతేడాది వాతావరణ ఆధారిత బీమా కింద పత్తి రైతులు ప్రీమియం చెల్లించినా పరిహారం అందలేదు. అసలు ఆ పరిహారం వస్తుందా.. రాదా అనేది తెలియని పరిస్థితి. వాతావరణ ఆధారిత బీమాలో అటు వర్షాభావ పరిస్థితుల్లోనూ, ఇటు అతివృష్టిలోనూ పరిహారం అందజేసే పరిస్థితి ఉంటుంది. ప్రీమియం చెల్లించినా పరిహారం ఎప్పుడొస్తుందో అనే విషయంలో స్పష్టత లేకపోవడం రైతులను అయోమయానికి గురిచేస్తోంది.

ప్రధానంగా ఈ బీమాకు సంబంధించిన కార్యాలయం ఆదిలా బాద్‌లో లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఉంది. దీంతో వ్యవసాయ అధికారులను రైతులు సంప్రదించినా పరిహారం విషయంలో వారు ఒక స్పష్టతను ఇవ్వలేకపోతున్నారు. అసలు పరిహారం వస్తుందా.. రాదా అనే విషయాన్ని కూడా చెప్పలేకపోవడంతో రైతుల్లో అయోమయం కనిపిస్తోంది. దీంతో అసలు ప్రీమియం చెల్లించి లాభమేమిటన్న అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. దీంతోనే పలువురు రైతులు వాతావరణ ఆధారిత, ఫసల్‌బీమా యోజన ప్రీమియం గడువులోగా బ్యాంకుల్లో రుణం తీసుకునేందుకు కూడా వెనుకంజ వేస్తున్నారు. బ్యాంకులో రుణం తీసుకున్న రైతుకు సంబంధించి ప్రీమియం డబ్బులను రుణం నుంచే తీసుకోవడం జరుగుతుంది. దీంతో రైతులు గడువు తర్వాతే రుణం తీసుకునేందుకు ఆసక్తి కనబర్చుతున్నారంటే ఈ బీమాలపై ధీమా లేకపోవడమే కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇదీ పరిస్థితి..
జిల్లాలో లక్ష మందికి పైగా రైతులు ఉన్నారు. జిల్లాలో పంటల సాధారణ విస్తీర్ణం లక్షా 92,626 హెక్టార్లు కాగా, అందులో లక్షా 86,007 హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యాయి. అందులో అత్యధికంగా లక్షా 28,300 హెక్టార్లలో పత్తి పంట సాగైంది. ఇది సాధారణ విస్తీర్ణం కంటే 3 శాతం అధికం. సోయాబీన్‌ 30,120 హెక్టార్లలో సాగైంది. కందులు 21,260 హెక్టార్లలో సాగు చేశారు. మిగతా పంటలు కొద్దిమొత్తంలో సాగయ్యాయి. కాగా పత్తిని మండల యూనిట్‌గా వాతావరణ ఆధారిత బీమా కింద, సోయా, కందులు, ఇతర పంటలు గ్రామ యూనిట్‌గా ఫసల్‌ బీమా యోజన కింద బీమా చెల్లించేందుకు గత నెలలో గడువులోగా కొద్ది మంది రైతులు మాత్రమే ప్రీమియం చెల్లించారు.

బ్యాంక్‌ రుణం ద్వారా కొంతమంది, నాన్‌లోనింగ్‌ రైతులు కూడా మీసేవ ద్వారా నేరుగా ఈ ప్రీమియం కట్టి బీమా కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఫసల్‌ బీమాలో రైతులు 10వేలలోపే ఉండడం గమనార్హం. ఇక వాతావరణ ఆధారిత బీమాలో వేల మంది రైతులు ప్రీమియం కట్టారు. పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా ఏ యేడాదికి సంబంధించి ఆ యేడాది బీమా పరిహారం డబ్బులు అందజేయాలని రైతుల నుంచి డిమాండ్‌ చేస్తున్నారు. తద్వారా తదుపరి పంటల సాగులో పెట్టుబడికి కొంత ఉపయుక్తంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2017లో పలువురు రైతులు వాతావరణ ఆధారిత బీమా కింద ప్రీమియం చెల్లించినా వారికి పరిహారం రాకపోవడంతో ఈయేడాది పలువురు రైతులు ఈ బీమా పొందేందుకు ఆసక్తి చూపడం లేదనేది స్పష్టమవుతోంది.

సర్వే ప్రారంభం..
జాతీయ బీమా కంపెనీ(ఎన్‌ఐసీ) జిల్లాలో ఫసల్‌ బీమా యోజనకు సంబంధించి సర్వే మొదలు పెట్టింది. ప్రధానంగా పంట నష్టం సంభవించిన తర్వాత రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ఈ బీమా అధికారులపై సర్వేను త్వరగా ప్రారంభించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కలెక్టర్‌ కూడా ఎన్‌ఐసీ అధికారులతో సమావేశమై రైతులకు పరిహారం అందించే విషయంలో సర్వే చేసి పరిహారం అందించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. కాగా మంగళవారం జైనథ్, బేల, ఆదిలాబాద్‌రూరల్‌ మండలాల్లో ఈ సర్వే మొదలుపెట్టారు.

ఎన్‌ఐసీ క్లస్టర్‌ మేనేజర్‌ రాకేష్‌రెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖాధికారులతో కలిసి సర్వే ప్రారంభించారు. ఇచ్చోడ, తలమడుగు, తాంసి, భీంపూర్‌లలో బుధవారం నుంచి సర్వే చేపట్టారు. నివేదికను ప్రభుత్వానికి పంపిస్తారు. ఆ తర్వాత పరిహారం విషయంలో స్పష్టత వస్తుంది. అత్యధికంగా వాతావరణ ఆధారిత బీమా కింద పత్తి రైతులు ప్రీమియం చెల్లించి ఉన్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి సర్వే చేసి రైతులకు న్యాయం చేస్తేనే జిల్లాలో అధిక మంది రైతులకు ప్రయోజనం దక్కే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు