వర్షార్పణం

29 Jan, 2019 05:05 IST|Sakshi
తడిసిన పత్తిపంటను చూపుతున్న రైతు

వేలాది ఎకరాల్లో వివిధ పంటలు ధ్వంసం

కరీంనగర్, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో నీట మునిగిన వైనం

మార్కెట్‌ యార్డుల్లో తడిసిన మిర్చి, కందులు

అధికారిక అంచనా ప్రకారం 104 గ్రామాల్లో 3,845 ఎకరాల్లో నష్టం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు అన్నదాతకు కన్నీళ్లు మిగిల్చాయి. కళ్లాల్లో, మార్కెట్‌ యార్డుల్లోని పంట ఉత్పత్తులు ధ్వంసమయ్యాయి. మిర్చి, సోయాబీన్, కందులు, వేరుశనగ వర్షానికి తడిసిపోయాయి. కరీంనగర్, పెద్దపల్లి, వనపర్తి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 14 మండలాల్లోని 104 గ్రామాల్లో వేసిన పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. ఆయా జిల్లాల్లో 3,845 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు తెలిపింది. 2,077 మంది రైతులు నష్టపోయినట్లు నివేదిక వెల్లడించింది.

ప్రధానంగా 2,708 ఎకరాల్లో వేరుశనగ పంట దెబ్బతిన్నది. మొక్కజొన్న పంటకు 679 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. 220 ఎకరాల్లో వరి నీట మునిగింది. అయితే వ్యవసాయశాఖ నష్టాన్ని అంచనా వేయడానికి అంతగా ఆసక్తి చూపించడంలేదు. ఈ కొద్దిపాటి దానికి ఎందుకు హంగామా అన్న ధోరణి ప్రదర్శిస్తుందన్న ఆరోపణలున్నాయి. అనధికారిక అంచనా ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 వేల ఎకరాలకు పైనే పంట నష్టం జరిగి నట్లు సమాచారం. సిద్దిపేట జిల్లాలో అకాల వర్షాలతో 200 ఎకరాల సోయాబీన్, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న.. 100 ఎకరాల్లో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి.

ఫలితంగా రైతులకు రూ.15 లక్షల నష్టం వాటిల్లింది. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 2,250 ఎకరాల్లో, భూపాలపల్లి జిల్లాలో వందలాది ఎకరాల్లో మిర్చి పంటకు నష్టం వాటిల్లింది. భారీ వర్షాలతో మొక్కజొన్న పంట దెబ్బతిన్నది. లేత కంకులు విరిగిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఏరిన మిర్చిని కళ్లాల్లో పెట్టిన రైతులకు మాత్రం ఈ వర్షాలు కడగండ్లు మిగిల్చాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కొన్నిచోట్ల కళ్లాల్లోని మిర్చి వర్షం నీటిలో కొట్టుకుపోయింది. అలాగే మార్కెట్‌ యార్డుల్లో విక్రయానికి తీసుకువచ్చిన కందులు, వేరుశనగ కూడా తడిసిపోయాయి. కొన్నిచోట్ల కంది చేలు దెబ్బతిన్నట్లు, వర్షానికి కాయ రాలిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. చివరితీతలో ఉన్న పత్తి కూడా ఈ వర్షానికి దెబ్బతిన్నది.

నేడూరేపు పొడి వాతావరణం...
హిందూ మహాసముద్రం దాన్ని ఆనుకుని ఉన్న అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. మరోవైపు ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. అయితే మంగళ, బుధవారాల్లో మాత్రం పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదిలా ఉండగా గత 24 గంటల్లో రాష్ట్రంలో అనేకచోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. ఖమ్మం జిల్లా కొణిజర్లలో అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చండ్రుగొండలో 6 సెంటీమీటర్లు, ఆర్మూరు, డోర్నకల్, తల్లాడ, నల్లగొండ, దేవరకొండ, సూర్యాపేటలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మంచిర్యాల జిల్లాలో పత్తి పూర్తిగా తడిసిపోయింది. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు రాష్ట్రవ్యాప్తంగా గణనీయంగా పడిపోయాయి. సాధారణం కంటే రెండు నుంచి తొమ్మిది డిగ్రీల వరకు తగ్గిపోయాయి. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణానికి అటుఇటుగా నమోదయ్యాయి. మెదక్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీలు నమోదైంది. పగటి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పలుచోట్ల జనం చలితో ఇబ్బందిపడ్డారు.

నగరంపై పొగమంచు పంజా...
రాజధానిపై మరో రెండురోజులపాటు పొగమంచు దుప్పటి కమ్మేసే అవకాశాలున్నట్లు బేగం పేటలోని వాతావరణ శాఖ ప్రకటించింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో నగరంలో గత మూడు రోజులుగా ఆకాశం మేఘావృతమై తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైన విషయం విదితమే. అయితే ప్రస్తుతానికి అల్పపీడన ద్రోణి బలహీనపడినప్పటికీ మంగళ, బుధ వారాల్లో ఆగ్నే య, దక్షిణ దిశ నుంచి వీస్తున్న తేమ, వేడి గాలులతో తెల్లవారుజామున ఆకాశం మేఘావృతమై పొగమంచు దుప్పటి కమ్ముకునే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ సమయంలో రాకపోకలు సాగించే వాహనదారులు, ప్రయాణికులు, ఉబ్బసం వ్యాధిగ్రస్తులు, చిన్నారులు, వృద్ధులు బయటికి వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం వేళ పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలున్నాయన్నా రు. కాగా సోమవారం నగరంలో గరిష్టంగా 21.2, కనిష్టంగా 17.1 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమ 94 శాతం గా నమోదైంది. సాధారణం కంటే 9 డిగ్రీల మేర తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడం, గాలిలో తేమ అనూహ్యంగా పెరగడంతో ప్రజలు చలితో ఇబ్బందిపడ్డారు.
 

మరిన్ని వార్తలు