హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం

25 Sep, 2019 18:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరాన్ని భారీ వర్షం వణికిస్తోంది. మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ ఏకధాటిగా కురిసిన వర్షానికి భాగ్యనగరం తడిసిముద్దయిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం కాస్తా తెరపి ఇచ్చినా.. సాయంత్రానికి మళ్లీ భారీ వర్షం మొదలైంది. నగరంలోని పలు ప్రాంతాలలో వాన దంచి కొడుతోంది. ముషిరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు, చిక్కడపల్లి, హిమాయత్‌నగర్‌, అబిడ్స్‌, కోఠీ, దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, కొత్తపేట, సరూర్‌నగర్‌, మీర్‌పేట్‌, వనస్థలిపురం, ఎల్బీనగర​లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.  భారీ వర్షం కురుస్తుండటంతో ఉద్యోగులు ఇళ్లకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రెండు గంటల పాటు బయటకు రావొద్దు .. జీహెచ్‌ఎంసీ హెచ్చరిక
వర్షాలపై అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు.. ప్రజలకు పలు సూచనలు చేస్తూ ప్రకటన విడుదల చేశారు. నగరంలో మరో 2 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ అధికారుల తెలిపారు.రానున్న రెండు గంటల పాటు ఉద్యోగులు కార్యాలయాల నుంచి బయటకు రావొద్దని  జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌ విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాలతో ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఉండేందుకు 13 డిజాస్టర్‌ రెస్క్యూ బృందాలను అప్రమత్తం చేశామన్నారు. నీటి నిల్వలు ఎప్పటికప్పుడు తొలగించేందుకు 255 పంపలు సిద్ధం చేశామన్నారు. జీహెచ్ఎంసీ జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించాలని కమిషనర్ ఆదేశించారు. ఏమైన సమస్యలు ఉంటే జీహెచ్‌ఎంసీ కాల్‌ సెంటర్‌ 040-21111111, ఎమర్జెన్సీ 100 కి కాల్‌ చేయాలని సూచించారు. 

మరిన్ని వార్తలు