వానలతో ఆదిలాబాద్ అతలాకుతలం

9 Jul, 2016 20:14 IST|Sakshi

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రోజంతా ముసురు పట్టడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావడానికి ఇబ్బందులు పడ్డారు. జిల్లాలోని ఆసిఫాబాద్, ఉట్నూర్, ఆదిలాబాద్ డివిజన్ల పరిధిలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఎగువన ఉన్న మహరాష్ట్రలో కూడా వర్షాలు కురియడంతో పెన్‌గంగ, ప్రాణహిత నదిలో వరద ప్రవాహం పెరిగింది. సిర్పూర్(టి) మండలం తాటిచెట్టు ఒర్రె పొంగి ప్రవహించడంతో కౌటాల, బెజ్జూరు మండలాల పరిధిలోని పలు గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

బెల్లంపల్లి-వేమనపల్లి రహదారిపై నాగారం వద్ద ఉన్న లోతొర్రె తాత్కాలిక వంతెన కొట్టుకుపోయి వాహనాలు నిలిచిపోయాయి. ఈ ప్రాంతంలో సుమారు 30 గ్రామాలకు విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. నిర్మల్-ఆదిలాబాద్ రహదారిపై వాంకిడి వద్ద ఉన్న లో లెవల్ తాత్కాలిక వంతెన తెగిపోవడంతో వాహనాలను జాతీయ రహదారి మీదుగా మళ్లించారు. ఇచ్చోడ-బజారహత్నూర్ రహదారిపై బలాల్‌పూర్ వాగు పొంగి ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎడతెరపిలేని వర్షాల కారణంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. శ్రీరాంపూర్, ఖైరీగూడ, డోర్లీ-1, రామకష్ణాపూర్, డోర్లీ-2 ఓపెన్‌కాస్టు గనుల్లో 23 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి నిలిచిపోయింది.

మరిన్ని వార్తలు