వరద హోరు..

12 Aug, 2018 08:14 IST|Sakshi
గేట్లు ఎత్తివేయడంతో ఉధృతంగా ప్రవహిస్తున్న కిన్నెరసాని రిజ ర్వాయర్‌

సాక్షి, కొత్తగూడెం(ఖమ్మం): ఎడతెరిపి లేని వర్షంతో జిల్లా తడిసి ముద్దయింది. శుక్రవారం రాత్రి నుంచి వరుణుడు ఆగకుండా ప్రతాపం చూపడంతో జిల్లాలో ఈ ఏడాదిలో ఇప్పటివరకు అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 23 మండలాల్లో 1,177.6 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. ఈ వర్షం ఇంకా కొనసాగుతూనే ఉంది. భారీ వర్షంతో జిల్లాలోని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.

అనేక గ్రామాల్లోకి వరద నీరు చొచ్చుకుని రావడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల పంటలు నీటమునిగాయి. గుండాల, ఆళ్లపల్లి, అశ్వాపురం, పాల్వంచ తదితర మండలాల్లో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాకు ఎగువ ప్రాంతంలో కూడా భారీగా వర్షం కురవడంతో నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

కిన్నెరసాని నది, జల్లేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆళ్లపల్లి మండలంలో కిన్నెరసాని వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది. గుండాల మండలంలోని మల్లన్నవాగు, ఏడుమెలికలవాగు, నడివాగు, దున్నపోతులవాగు భారీగా ప్రవహిస్తుండడంతో మండలంలోని 50 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గుండాల మండలం నాగారం గ్రామానికి చెందిన పర్శిక శిరీష అనే గర్భిణిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అనేక అవస్థలు పడాల్సి వచ్చింది.

5 కిలోమీటర్ల మేర ట్రాక్టరుపై తీసుకొచ్చారు. కిన్నెరసాని వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తుండడంతో ఆమెను దాటించేందుకు అనేక గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడ్డారు. అశ్వాపురం మండలంలోని గొందిగూడెం ఇసుకవాగు పొంగుతుండడంతో ఎలకలగూడెం, గొందిగూడెం, మనుబోతులగూడెం, ఇప్పలగుంపు గ్రామాలకు రాకపోకలు బంద్‌ అయ్యాయి. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని గ్రామంలో ఇళ్లలోకి వరదనీరు చేరింది. 22 గ్రామాలకు రవాణా నిలిచిపోయింది.

ఇక బూడిదవాగు పొంగడంతో సూరారం, సోములగూడెం, పాండురంగాపురం గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. కిన్నెరసాని గేట్లు ఎత్తడంతో రాజాపురం వద్ద నీటి ప్రవాహం ఉధృతమైంది. పొలాల్లో రైతులు ఏర్పాటుచేసుకున్న మోటార్లు కొట్టుకుపోయాయి. చర్ల మండలంలో బత్తినపల్లి వాగు, బాగనెల్లి వాగు, చింతవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో బత్తినపల్లి, కుర్నపల్లి, బాగనెల్లి, చింతగుంపు గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మణుగూరు మండలంలోని కోడిపుంజులవాగు ఉవ్వెత్తున ప్రవహిస్తుండడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.

ఇళ్లలోకి వరదనీరు చేరింది. రోడ్లపైకి నీరు వచ్చింది. బూర్గంపాడు మండలంలో పంటలు నీటమునగగా కొత్తగూడెం, మణుగూరు, టేకులపల్లిలో ఓసీల్లోకి నీరు చేరి బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. టేకులపల్లి మండలంలో రోడ్లపై చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలాయి. దుమ్ముగూడెం మండలం పెద్దనల్లబెల్లి వద్ద రోడ్డుకు అడ్డంగా భారీ వృక్షం కూలిపోయింది. పర్ణశాలలో సీతమ్మవాగు ఉప్పొంగుతోంది. కొత్తగూడెంలో ముర్రేడువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. సుజాతనగర్‌ మండలంలో ఎదుళ్లవాగు ఉరకలెత్తుతోంది. దమ్మపేట మండలం మొండివర్రె గ్రామంలో గోపికృష్ణ అనే రైతుకు చెందిన కాకరతోట పడిపోయి రూ.లక్ష మేర నష్టం వాటిల్లింది.
 
గోదావరిలో గల్లంతైన ముగ్గురిని రక్షించిన పోలీసులు..
పినపాక మండలం రాయిగూడెం వద్ద ముగ్గురు యువకులు గోదావరిలో చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యారు. తక్షణమే సమాచారం అందుకున్న పోలీసులు పడవల సహాయంతో వారిని  రక్షించారు. లక్ష్మిదేవిపల్లి మండలం చింతపెంట వద్ద ఎర్రసానివాగు ప్రవాహంలో ఒక ఆటో, రెండు బైకులు కొట్టుకుపోయాయి. స్థానికుల సహాయంతో ప్రయాణికులు బయటపడ్డారు.
 
గరిష్ట నీటిమట్టానికి జలాశయాలు.. గేట్ల ఎత్తివేత..
పాల్వంచ మండలంలోని కిన్నెరసాని జలాశయంలోకి 407 అడుగుల గరిష్ట మట్టానికి నీరు చేరడంతో శనివారం అధికారులు మొత్తం 13 గేట్లు ఎత్తి 88 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. ఇన్‌ఫ్లో 80 వేల క్యూసెక్కులు ఉంది. చర్ల మండలంలోని తాలిపేరు జలాశయంలో గరిష్ట నీటిమట్టం 74 మీటర్లు కాగా 73.35 మీటర్ల నీరు చేరింది. ఇన్‌ఫ్లో 80 వేల క్యూసెక్కులు ఉండగా, 15 గేట్లను పూర్తిగా ఎత్తి 1.03 లక్షల క్యూసెక్కుల చొప్పున వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు జలాశయం గరిష్ట సామర్థ్యం 6.1 మీటర్లు కాగా 5.9 మీటర్ల నీరు చేరింది. 1 గేటు ఎత్తి 2,820 క్యూసెక్కులు కిందకు వదులుతున్నారు.
 
మంత్రి తుమ్మల సమీక్ష..
జిల్లావ్యాప్తంగా కురిసిన వర్షం కారణంగా జరిగిన నష్టంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. దెబ్బతిన్న రహదారులు, చెరువుకట్టల విషయమై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. బూర్గంపాడు మండలంలో బస్సు వాగులో పడిన ఘటనపై మంత్రి ఆరా తీశారు.

మరిన్ని వార్తలు