‘ముసురు’కున్న రాజధాని

13 Jul, 2018 02:48 IST|Sakshi

బుధవారం రాత్రి నుంచి గురువారం రాత్రి వరకు వాన

నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు.. స్తంభించిన ట్రాఫిక్‌

వచ్చే 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మహానగరాన్ని ముసురు కమ్మేసింది. అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నగరంలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. బుధవారం రాత్రి తేలికపాటి చినుకులతో మొదలైన వాన.. గురువారం రాత్రి పొద్దుపోయే వరకు కురుస్తూనే ఉంది. గురువారం ఉదయం 8 గంటల వరకు నగరంలో సరాసరిన మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక గురువారం సాయంత్రం 6 గంటల వరకు సరాసరిన రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో సాధారణ జనజీవనం స్తంభించింది. పలు లోతట్టు ప్రాంతాల్లోని బస్తీలు నీటమునిగాయి. ప్రధాన రహదారులపై వర్షపునీరు నిలిచిపోవడంతో నగరవాసులు ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో చిక్కుకుని నరకయాతన అనుభవించారు. నగరాన్ని ముసురు వీడకపోవడంతో చిరు వ్యాపారులు, ఫుట్‌పాత్‌ వ్యాపారాలు గిరాకీ లేక వెలవెలబోయాయి. నగరంలోని పలు పర్యాటక ప్రదేశాల్లోనూ జనసంచారం కనిపించలేదు. రాగల 24 గంటల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ కేంద్రం తెలిపింది.

మరిన్ని వార్తలు