పునరావాసం మిగిలింది..

22 Aug, 2018 11:19 IST|Sakshi

ఇది ఆదిలాబాద్‌ మండలం చించుఘాట్‌ నుంచి గుండంలొద్ది గ్రామానికి వెళ్లే దారి. భారీ వర్షాల కారణంగా లక్ష్మీపూర్‌ ప్రాజెక్టు(గుండంలొద్ది) పొంగి పొర్లడంతో వరద ధాటికి వంతెన కొట్టుకుపోయింది. దీంతో గుండంలొద్దికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ గ్రామంలో 30 ఇళ్లు ఉండగా, సుమారు 150 నుంచి 200 మంది నివసిస్తున్నారు. వారం రోజులుగా ఈ గుండంలొద్దిని చేరుకోలేని పరిస్థితి. కొంత వరద ప్రభావం తగ్గడంతో ఇప్పుడు ఆ గ్రామానికి నిత్యావసర సరుకులు, దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేసే పని మొదలైంది. ఆ గ్రామానికి వెళ్లే దారి లేకపోవడంతో ఆదివాసీ నవయువ సూర్యవంశీ యూత్‌ సభ్యులు ఇలా వాగులో ఒకవైపు నుంచి మరోవైపునకు వరుసగా నిలబడి ఒక చెయ్యి నుంచి మరో చెయ్యికి సామగ్రి అందజేస్తూ ఈ గట్టు నుంచి ఆ గట్టుకు చేర్చి గ్రామంలోని ప్రజలకు సహాయ పడుతున్నారు. ఇలా అధికార యంత్రాంగంతోపాటు యూత్, స్వచ్ఛంద సంస్థలు తలా ఒక చెయ్యి వేస్తే జిల్లాలో పునరావాసం వేగిరమయ్యే అవకాశం ఉంటుంది.

సాక్షి, ఆదిలాబాద్‌: వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం విరామం ఇచ్చింది. ఇక వరద బాధితుల పునరావాసం మిగిలింది. ఇప్పటికీ అనేక గ్రామాలు జలదిగ్బంధనంలోనే ఉన్నాయి. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన గ్రామాలకు యంత్రాంగం చేరుకోవాల్సిన అవసరం ఉంది. వారిని అన్నివిధాలా ఆదుకొని పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ముందుంది. జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. వరద బాధితుల సహాయార్థం తలో చెయ్యి వేయాలన్న కలెక్టర్‌ పిలుపు మేరకు పలువురు నిత్యావసర సరుకులు, దుప్పట్లు, దుస్తులు, ఇతరత్ర సామగ్రిని అందజేశారు. ఇప్పుడు బాధి తులకు వాటిని చేరవేస్తున్నారు. మరోవైపు స్వచ్ఛంద సంఘాలు ముందుకు వచ్చి బాధితులకు ఆసరాగా నిలుస్తున్నాయి. పునరావాస కేంద్రాల నుంచి బాధితులు ఇళ్లలోకి చేరుకుంటున్నారు.

చెత్త, బురదమయం..
వరద తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడు ఇటు జిల్లాకేంద్రంలోని కాలనీలతోపాటు గ్రామాల్లో ఎటుచూసినా చెత్త, బురదమయంగా కనిపిస్తోంది. వరద నీరు కారణంగా బావులు కలుషితం అయ్యాయి. ఈ నేపథ్యంలో వాటి నీళ్లు తాగిన ప్రజలు అస్వస్థతకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు పారిశుధ్యం ప్రధాన సమస్యగా ఉంది. గ్రామాల్లో  పరిస్థితులు అధ్వానంగా మారాయి. దీంతో అతిసార, డయేరియా వ్యాధుల ముప్పు కనిపిస్తోంది. ఇప్పటికే జిల్లాలో జనవరి 1 నుంచి ఇప్పటివరకు 10వేల డయేరియా కేసులు, మలేరియా రెండు కేసులు నమోదయ్యాయి. డెంగీ 35 కేసులు పాజిటీవ్‌ వచ్చాయి. అందులో మూడు కేసులు మాత్రమే ప్రభావం అధికంగా ఉందని నిర్ధారిం చారు. వారికి చికిత్స అందజేశారు. తాజాగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ పరిస్థితి తీవ్ర రూపం దాల్చే అవకాశాలు లేకపోలేదు. తలమడుగు మండలంలోని లక్ష్మీపూర్‌ గ్రామంలో కృష్ణవేణి అనే నాలుగేళ్ల చిన్నారి డయేరియాతో మృతిచెందింది.

యంత్రాంగాల సమన్వయం..
జిల్లాలో వరద ముప్పు క్రమంగా తగ్గుతుండడంతో జిల్లా యంత్రాంగం సమన్వయంగా గ్రామాల్లో రక్షిత చర్యలు చేపడుతోంది. ప్రధానంగా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆశ వర్కర్ల ద్వారా ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో క్లోరిన్‌ బిళ్లలను సరఫరా చేస్తున్నారు. తాగే నీటి కుండలో ఒక క్లోరిన్‌ బిళ్ల వేసి ఆరు గంటల తర్వాత నీరు తాగాలని సూచిస్తున్నారు. ఇప్పటికే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఫార్మాసిస్ట్‌ ద్వారా ఆశ వర్కర్లకు ఈ బిళ్లలను సరఫరా చేశారు. వారు గ్రామాల్లో ప్రజలకు అందజేయాల్సి ఉంది. అన్ని మండలాల్లో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఎక్కడైనా డయేరియా, అతిసార ప్రభావం అధికంగా ఉంటే మూడు రోజుల నుంచి వారం రోజులపాటు శిబిరాలను కొనసాగించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది.

ప్రధానంగా రెండు రోజులపాటు జ్వరం తగ్గని పక్షంలో ఆస్పత్రిలో చికిత్స పొందాలని సూచిస్తున్నారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో ట్యాంకుల్లో, బావుల్లో క్లోరినేషన్‌ చేపడుతున్నారు. ఇదిలా ఉంటే ఆదిలాబాద్‌ పట్టణంలో మిషన్‌ భగీరథ ద్వారా నీటి సరఫరాను పెంచడం జరిగింది. సోమవారం లక్షా 20వేల లీటర్లు, మంగళవారం 50వేల లీటర్లు పట్టణంలో సరఫరా చేశారు. గ్రామాల్లోని రక్షిత మంచినీరు దొరకని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గ్రామాలపై ప్రధానంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
 
పారిశుధ్యం కోసం ప్రత్యేక డ్రైవ్‌..
గ్రామాల్లో ప్రస్తుతం పారిశుధ్యమే ఒక సవాల్‌గా మారింది. ప్రధానంగా ఇటీవల జిల్లాలోని 467 గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారులకు నియమించినప్పటికీ ఆ అధికారులు గ్రామాలపై దృష్టి సారించలేని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా రెవెన్యూ, వ్యవసాయ శాఖకు చెందిన అధికారులే ఇందులో 200లకు పైగా ఉన్నారు. ఆ అధికారులు ఇప్పుడు గ్రామాల్లో పంట నష్ట సర్వే చేపట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వారు ప్రత్యేక అధికారులుగా తక్షణం గ్రామాలపై దృష్టి సారించలేకపోతున్నారు. ఎంపీడీఓలు, ఈఓఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో పారిశుధ్య పనులపై దృష్టి సారించారు. ప్రధానంగా చెత్తాచెదారాన్ని తొలగించి బురదమయమైన చోట మొరం, మట్టితో మరమ్మతులు చేయించాల్సి ఉంది.

బుధవారం నుంచి ఈ పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు గ్రామపంచాయతీల్లో కార్మికులు సమ్మెలో ఉండడంతో కొంత ఇబ్బంది ఎదురవుతోంది. పారిశుధ్యం కోసం ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని ఇదివరకే ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలన మొదలైన తర్వాత ఆదేశించారు. ఇంతలోనే జిల్లాలో భారీ వర్షాలు కురువడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. దీంతో ఈ డ్రైవ్‌కు సంబంధించి అధికారులు ప్రస్తుతం చర్యలు చేపడుతున్నారు. ప్రత్యేకంగా కార్మికులను నియమించుకొని ఈ పని చేపట్టాలని యోచిస్తున్నారు. మరోపక్క 14వ ఆర్థిక సంఘంకు చెందిన నిధులను ఈ పనులకు ఉపయోగించుకునే దిశగా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో అధికారులు స్పెషల్‌ సానిటేషన్‌ డ్రైవ్‌పై దృష్టి సారించారు.

సానిటేషన్‌ డ్రైవ్‌కు సిద్ధం
జిల్లాలో పారిశుధ్య పనులను వేగిరం చేసేందుకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నాం. కొంతమంది కార్మికులను నియమించుకొని ఈ పనులు చేపడతాం. ప్రత్యేక అధికారుల్లో 200 మందికి పైగా వ్యవసాయ పంట నష్టం సర్వేలో ఉండడంతో మిగిలిన ఈఓఆర్డీ, ఎంపీడీఓ, జెడ్పీ, కోఆపరేటీవ్, తదితర సిబ్బంది సహకారంతో ఈ డ్రైవ్‌ను చేపట్టేందుకు సిద్ధమవుతున్నాం. ఇప్పటికే బావుల్లో క్లోరినేషన్‌ చేశాం. మురుగు నీటి కాలువల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడం జరుగుతుంది. మట్టి, మొరంతో బురద  ప్రాంతాలను సరిచేస్తున్నాం. – జితేందర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ, ఆదిలాబాద్‌

మరిన్ని వార్తలు