స్వయంకృషి

25 Aug, 2018 17:09 IST|Sakshi
వరద కాలువ నీటిని చెరువుకు మళ్లిస్తున్న రైతులు

మోర్తాడ్‌ (నిజామాబాద్‌): మోర్తాడ్‌ మండలం పాలెంకు చెందిన రైతులు స్వయం కృషితో సాగునీటి కష్టాలను గట్టెక్కుతున్నారు. గ్రామానికి చెందిన బూరుగు చెరువు కింద దాదాపు 250 ఎకరాల వరి సాగవుతోంది. ఇటీవల భారీ వర్షాలు కురిసినా చెరువులోకి నీరు చేరలేదు. వరద కాలువ నిర్మాణం వల్ల చెరువులోకి నీరు రావడానికి ఉన్న అన్ని దారులు మూసుకు పోయాయి. పెద్దవాగులోని ఎత్తిపోతల పథకమూ పనిచేయడం లేదు. చెరువు నిండటానికి వరద కాలువ ద్వారా వచ్చే నీరు ఒక్కటే దిక్కయ్యింది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం చేరిన తర్వాత గోదావరి నదిలోకి నీటిని మళ్లించే పరిస్థితి వస్తేనే వరద కాలువకు నీటిని విడుదల చేస్తారు. ప్రస్తుతం వరద కాలువకు నీటిని మళ్లించే పరిస్థితి లేదు.

దీంతో వర్షాలకు వరద కాలువలో నిలువ ఉన్న నీటిని వినియోగించుకోవాలని రైతులు సంకల్పించారు. చెరువు కింద ఉన్న ఆయకట్టు భూముల రైతులు ఒక్కటై ఎకరానికి రూ.4 వేల చొప్పున జమ చేసి రూ.10 లక్షల ఖర్చుతో నీటి మళ్లింపునకు ఏర్పాట్లు చేసుకున్నారు. వరద కాలువలో పంపుసెట్లను అమర్చి వాటి ద్వారా నీటిని వరద కాలువ తూముకు, అక్కడి నుంచి బూరుగు చెరువుకు మళ్లిస్తున్నారు. చెరువులో పూర్తి స్థాయి నీరు నిండితే ఖరీఫ్, రబీ పంటలను గట్టెక్కించవచ్చని రైతులు భావిస్తున్నారు. అంతేగాక  చెరువులో నీరు సమృద్ధిగా ఉంటే బోరుబావులకు భూగర్భ జలాలు అందుతాయని, బోరుబావులు ఎత్తిపోకుండా ఉంటాయని రైతులు చెబుతున్నారు. ఏది ఏమైనా వరద కాలువలోని నీటిని మళ్లించడానికి పాలెం రైతులు చేసిన కృషిని పలువురు అభినందిస్తున్నారు.

పంటలకు ఇబ్బంది లేదు 
వరద కాలువలోని నిలువ ఉన్న నీటిని మళ్లించుకోవడం వల్ల పంటలకు ఇబ్బంది లేదు. వర్షాలు కురిసినా బూరుగు చెరువులోకి నీరు రాలేదు. కాని మా ప్రయత్నంతో మాత్రం నీరు వస్తోంది. రైతులు ఏకం కావడం వల్ల సాధ్యం కాదనుకున్నది సుసాధ్యం అయ్యింది. అందరి కృషి ఫలితమే ఇది. – జగురంపల్లి వెంకన్న, రైతు, పాలెం

మరిన్ని వార్తలు