ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

13 Aug, 2018 06:49 IST|Sakshi
హన్మకొండ అర్బన్‌ : కలెక్టరేట్‌లో సమీక్షిస్తున్న ప్రత్యేక అధికారి శివశంకర్, కలెక్టర్‌ అమ్రపాలి

హన్మకొండ అర్బన్‌: రాష్ట్రంలో రానున్న రెండు, మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిసున్నందున జిల్లా అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రత్యేక అధికారి ఎన్‌.శివశంకర్‌ అన్నారు. వర్షాల నేపథ్యంలో వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమితులైన సీనియర్‌ ఐఏఎస్‌ శివశంకర్‌ ఆదివారం సాయంత్రం జిల్లాకు వచ్చారు. సుబేదారి కలెక్టరేట్‌లో కలెక్టర్‌ అమ్రపాలి, గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కమిషనర్‌ గౌతం, ఇతర అధికారులతో వర్షాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా శివశంకర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఇరిగేషన్, విద్యుత్, రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

చెరువులు పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. పునరావాస కేంద్రాలపై ప్రజలకు ముందే సమాచారం ఇవ్వాలని, కేంద్రాలు గుర్తించి సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. కలెక్టర్‌ అమ్రపాలి మాట్లాడుతూ జిల్లాలో భారీ వర్షాల ప్రభావం పెద్దగా లేదని, జిల్లాలోని 646 చెరువులకు ఇప్పటి వరకు 42 చెరువులు మాత్రమే నిండాయని తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు 24 గంటలు స్థానికంగా అందుబాటులో ఉండాలని, వర్షాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. అవసరం మేరకు నగరంలోని లోతట్టు ప్రాంతాల వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్దం కావాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ వెంకారెడ్డి, వ్యవసాయశాఖ అధికారి ఉషాదయాళ్, ఆర్‌అండ్‌ బీ, పీఆర్‌ ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలి
జనగామ అర్బన్‌: జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శివశంకర్‌ అన్నారు. ఆదివారం జనగామ జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయనకు కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రెండు రోజులుగా జనగామ జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ముంపునకు గురయ్యే ప్రాంతాలను అధికారులు ముందే గుర్తించాలని, ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. అలాగే పొంగే అవకాశం ఉన్న వాగుల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం ఆయా మండలాల తహసీల్దార్లతో నివేదిక తెప్పించుకోవాలని సూచించారు. సమావేశంలో జనగామ డీసీపీ మల్లారెడ్డి, ఆర్డీఓ వెంకట్‌రెడ్డి, ఏసీపీ బాపురెడ్డి, ఆర్‌ అండ్‌ బీ ఈఈ నాగేందర్, డీఏఓ వీరునాయక్, అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు