ముందుంది మునక!

12 Jun, 2020 09:59 IST|Sakshi
బుధవారం కురిసిన వర్షానికి కుత్బుల్లాపూర్‌ దత్తాత్రేయ నగర్‌ రోడ్డుపై పోటెత్తిన వరద నీరు

జూన్‌– సెప్టెంబర్‌ మధ్య 80 రోజుల పాటు వానలు

నైరుతి ప్రభావంతో నగరంలో విస్తారంగా వర్షాలు  

సాధారణం కంటే 2 శాతం అధిక వర్షపాతం   

సుమారు 770 మిల్లీ మీటర్లు నమోదయ్యే అవకాశం  

గతం నుంచి పాఠాలు నేర్వని గ్రేటర్‌ యంత్రాంగం

కాగితాలకే పరిమితమైన మాస్టర్‌ ప్లాన్‌లు

ముంపు ముప్పులో లోతట్టు ప్రాంతాల ప్రజలు

సాక్షి, సిటీబ్యూరో: నైరుతి రుతుపవనాల ప్రభావంతో మహానగరంలో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలున్నాయి. ఇదే సమయంలో లోతట్టు ప్రాంతాలు, నాలాలు, చెరువులు, కుంటలనుఆనుకొని ఉన్న కాలనీలు, బస్తీల మునక తప్పదనే ప్రమాదకర సంకేతాలు సైతం వెలువడుతున్నాయి. ఈసారి జూన్‌–సెప్టెంబర్‌ (నైరుతి రుతుపవనాలు) మధ్యకాలంలో నగరంలో సాధారణం కంటే 2 శాతం అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సాధారణంగా జూన్‌– సెప్టెంబర్‌ మధ్యకాలంలో నగరంలో 755 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదవుతోంది. ఈసారి 770 మిల్లీ మీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్లు చెబుతోంది. మొత్తంగా నాలుగు నెలల్లో సుమారు 80 రోజులపాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. బుధవారం నగరంలో కురిసిన జడివానతో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రహదారులపై వరదనీరు, మురుగు సుడులు తిరిగింది. భారీ వర్షం కురిసిన సందర్భాల్లో నదీం కాలనీ, భండారీ లేఅవుట్, బతుకమ్మకుంట.. ఇలా గ్రేటర్‌ పరిధిలో సుమారు వందకుపైగా కాలనీలు, బస్తీలకు ముంపు ప్రమాదం పొంచి ఉంటుంది. దశాబ్దాలుగా నాలాలు విస్తరణకు నోచుకోకపోవడం, ఆక్రమణలు, చెరువులు, కుంటల ఎఫ్‌టీఎల్‌ పరిధిలో వేలాదిగా కాలనీలు, బస్తీలు వెలియడం, మురుగునీటి పారుదల వ్యవస్థకు సంబంధించిన మాస్టర్‌ప్లాన్‌ కాగితాలకే పరిమితం కావడంతో ఈ దుస్థితి నెలకొందనే విమర్శలు వినిపిస్తున్నాయి.  

ఆ పరిస్థితి తప్పదా?
ఈ ఏడాది కొన్నిసార్లు 10– 20 సెంటీమీటర్ల మేర భారీ, అతిభారీ వర్షాలు ఒకటి రెండు రోజులపాటు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో నగరంలోని లోతట్టు ప్రాంతాలు, చెరువులు, కుంటలు, నాలాలకు ఆనుకొని ఉన్న బస్తీల వాసులకు కంటిమీద కునుకు కరువయ్యే దుస్థితి ఎదురుకానుంది. ఏళ్లుగా కిర్లోస్కర్‌ కమిటీ సిఫారసులు అమలు కాకపోవడం, నగరంలో సుమారు 1500 కి.మీ మార్గంలో విస్తరించిన నాలాలు విస్తరణకు నోచుకోకపోవడం, వీటిపై వెలసిన సుమారు పదివేల అక్రమ నిర్మాణాలను తొలగించకపోవడంతో.. భారీ వర్షం కురిసిన ప్రతిసారీ ప్రధాన రహదారులు కాల్వలను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులుగా మారుతున్నాయి. 

సంసిద్ధత ఇలా...
ఈ సీజన్‌లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగినపుడు తీసుకోవాల్సిన చర్యలపై బల్దియా యంత్రాంగం రూ.25 కోట్ల అంచనా వ్యయంతో సుమారు వంద ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మాన్‌సూన్‌ యాక్షన్‌ ప్లాన్‌కు శ్రీకారం చుట్టింది. భారీ వర్షం కురిసే అవకాశాలున్న ప్రాంతాల ప్రజలను, అధికార యంత్రాంగాన్ని ముందుగానే అప్రమత్తం చేయడంతోపాటు డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ బృందాలను ఆయా ప్రాంతాల్లో మోహరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రత్యేక బృందాలకు అవసరమైన వాహనాలు, యంత్ర పరికరాలను సమకూర్చింది. 

వానాకాలంలోనే హడావుడి..
గంటకు సెంటీమీటరు చొప్పున సుమారు 24 గంటలపాటు 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే నగరం మునక తప్పదు. గతంలో భండారీ లేఅవుట్, రామంతాపూర్, నదీం కాలనీ తదితర ప్రాంతాల్లో చోటుచేసుకున్న అనుభవాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. వర్షాకాలంలోనే హడావుడి చేస్తున్న యంత్రాంగం వరద పరిస్థితికి శాశ్వత పరిష్కార చర్యలను తీసుకోవడంలో విఫలమవుతోంది. లోతట్టు ప్రాంతాల్లో వరదనీటిని భూగర్భంలోకి ఇంకించేందుకు వీలుగా పెద్ద విస్తీర్ణంలో.. అధిక సంఖ్యలో ఇంకుడు కొలనులను ఏర్పాటు చేయడం, నాలాలను విస్తరించడం, చెరువుల ఎఫ్‌టీఎల్‌ పరిధిలో అక్రమంగా వెలసిన నిర్మాణాలను తొలగించడం వంటి చర్యలు చేపడితేనే ఈ పరిస్థితికి శాశ్వతంగా చరమగీతం పాడే అవకాశాలుంటాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఈసారి 102 శాతం వర్షపాతం..   
ఈసారి సాధారణం కంటే 2 శాతం అధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయి. అంటే సాధారణ వర్షపాతం 100 శాతం అనుకుంటే.. ఈసారి 102 శాతం వర్షపాతం నమోదవుతుంది.  జూన్‌– సెప్టెంబర్‌ మధ్యలో 80 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముంది. ఆయా రోజుల్లో ఒకటి రెండుసార్లు భారీ, అతిభారీ వానలు పడతాయి. ఎల్‌నినో, లానినో ప్రభావాలు అంతగా  లేకపోవడంతో నైరుతి సీజన్‌లో వర్షాలకు ఢోకాలేదు.    – రాజారావు, వాతావరణ శాఖ శాస్త్రవేత్త, బేగంపేట్‌

మరిన్ని వార్తలు