ఊపందుకున్న నైరుతి 

2 Sep, 2019 01:38 IST|Sakshi
ఎస్సారెస్పీ ప్రస్తుత నీటి మట్టం

రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు

3 ప్రాంతాల్లో 14 సెంటీమీటర్ల చొప్పున కుండపోత

వచ్చే రెండ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు  

సాక్షి, హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాలు ఊపందుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి, కామారెడ్డి జిల్లా భిక్నూరు, వరంగల్‌ రూరల్‌ జిల్లా చెన్నారావుపేటల్లో ఏకంగా 14 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. అలాగే తాడ్వాయిలో 12, హన్మకొండ, రామాయంపేట, హసన్‌పర్తి, లింగంపేటలలో 11 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. కాళేశ్వరంలో 10, కామారెడ్డి, చెన్నూరులలో 9 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.  

24 గంటల్లో అల్పపీడనం... 
వాయవ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకి వెళ్లేకొద్దీ నైరుతి వైపునకు వంపు తిరిగి ఉంది. దీని ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో వాయవ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు మధ్యప్రదేశ్‌ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకి వెళ్లేకొద్దీ నైరుతి దిశ వైపునకు వంపు తిరిగి ఉంది. దీంతో తెలంగాణలో రాగల రెండ్రోజులు అనేకచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

ఉత్తర తెలంగాణకు భారీ వర్ష సూచన... 
వచ్చే రెండ్రోజులు తెలంగాణలో 75 శాతం ప్రాంతాల్లో ఒకటి నుంచి రెండు సెంటీమీ టర్లు మొదలుకొని ఆరు సెంటీమీటర్ల వరకు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర, తూర్పు తెలంగాణలో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు అంటే 7–11 సెంటీమీటర్లు మొదలు 12–20 సెంటీమీటర్ల వరకు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ వై.కె.రెడ్డి పేర్కొన్నారు.  

ఎస్సారెస్పీకి వరద 
బాల్కొండ:  శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద మొదలైంది. మహారాష్ట్రలోని బాలేగావ్, అముదుర బ్యారేజీల నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో ఎస్సారెస్పీకి ఎగువన గోదావరి నిండుగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం ఎస్సారెస్పీలోకి 5,490 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అది సోమవారం ఉదయానికి లక్ష క్యూసెక్కులకు పెరిగే అవకాశముందని డ్యామ్‌ డిప్యూటీ ఈఈ జగదీశ్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు