నిండుకుండల్లా మధ్యతరహా ప్రాజెక్టులు

13 Aug, 2018 02:27 IST|Sakshi

19 మధ్యతరహా ప్రాజెక్టుల్లోకి భారీగా ప్రవాహాలు

వాటి పరిధిలోని 3 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఆయువు

నిండిన ఎల్లంపల్లి, దిగువకు నీటి విడుదల

జూరాల, శ్రీశైలానికి స్థిరంగా వరద

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు మధ్యతరహా ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. గోదావరి, కృష్ణా బేసిన్‌ల పరిధిలోని 19 మధ్యతరహా ప్రాజెక్టులన్నీ నిండటంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ముఖ్యంగా ఆదిలాబాద్‌ జిల్లాలోని సాత్నాల, మత్తడివాగు, సుధ్దవాగు, వట్టివాగు, ఎన్టీఆర్‌ సాగర్, పీపీ రావు ప్రాజెక్టు, కొమురం భీం, గొల్లవాగు, నీల్వాయి, రాలివాగు ప్రాజెక్టులన్నీ నిండటంతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. వరంగల్‌ జిల్లాలోని లక్నవరం, పాలెంవాగు, గుండ్లవాగు ప్రాజెక్టులు, ఖమ్మం జిల్లాలోని తాలిపేరు, పెద్దవాగు, కిన్నెరసాని ప్రాజెక్టులు సైతం నిండుకుండలను తలపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుల కింద మొత్తంగా 3.44 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా ఇప్పటికే 2.09 లక్షల ఎకరాల ఆయకట్టులో పంటల సాగు జరిగింది. ప్రస్తుత వర్షాలకు ప్రాజెక్టులన్నీ నిండటంతో గరిష్టంగా 3 లక్షల ఎకరాల ఆయకట్టు నీటికి ఢోకా ఉండదని అధికారులు అంచనా వేస్తున్నారు.

నిండిన ఎల్లంపల్లి..: గోదావరి బేసిన్‌లో తొలిసారి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఈ సీజన్లో గరిష్టంగా 1,87,037 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టులో నిల్వ సామర్ధ్యం 20.18 టీఎంసీలుకాగా ప్రస్తుతం నిల్వ 19.12 టీఎంసీలకు చేరడంతో ఆదివారం మధ్యాహ్నం 16 గేట్లు ఎత్తి దిగువకు 2,89,184 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఆదివారం సాయంత్రానికి ఇన్‌ఫ్లో 43,120 క్యూసెక్కులకు తగ్గినప్పటికీ 8 గేట్లు ఎత్తి అంతే మొత్తం నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ నీరంతా దిగువనున్న సుందిళ్ల బ్యారేజీ వైపు వెళ్లడంతో అక్కడ పనులకు ఆటంకం ఏర్పడింది. ఇది సహా కడెం ప్రాజెక్టులోకి భారీ ప్రవాహాలు వస్తున్నాయి. ప్రాజెక్టులోకి ఆదివారం మధ్యాహ్నానికి 50 వేల క్యూసెక్కులు రావడంతో ప్రాజెక్టులో నిల్వ 7.60 టీఎంసీలకుగానూ 7.06 టీఎంసీలకు చేరింది. దీంతో ప్రాజెక్టు నుంచి దిగువకు 61,277 క్యూసెక్కులు వదులుతున్నారు. ఇక ఎస్సారెస్పీలోకి సైతం 3,224 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా ఇక్కడ 90 టీఎంసీలకుగాను ప్రస్తుతం 16.35 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

‘కృష్ణా’లో స్థిరంగా వరద.. 150 టీఎంసీలకు సాగర్‌
ఎగువనున్న మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టులు నిండటంతో వాటిలోకి వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు. ఆల్మట్టిలోకి ఆదివారం సాయంత్రం 30,900 క్యూసెక్కుల మేర వరద వచ్చి చేరుతుండగా అంతే నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ఎగువ ప్రవాహాలకు తోడు స్థానిక ప్రవాహాలు తోడవడంతో నారాయణపూర్‌కు 43,373 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో 42 వేల క్యూసెక్కులను దిగువకు వదిలారు. మరోవైపు తుంగభద్రకు రెండ్రోజుల కిందటి వరకు లక్ష క్యూసెక్కుల వరద రాగా అది ప్రస్తుతం 66వేల క్యూసెక్కులకు తగ్గింది. ప్రాజెక్టు నిండటంతో అక్కడి నుంచి 79,220 క్యూసెక్కులు వదిలేస్తున్నారు. రాష్ట్ర పరిధిలోని జూరాలకు 24 వేల క్యూసెక్కులు వస్తుండగా 38 వేల క్యూసెక్కులను దిగువకు వదిలారు. దీంతో శ్రీశైలానికి 35,430 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రస్తుతం శ్రీశైలంలో 215 టీఎంసీలకుగాను 139.63 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నాగార్జున సాగర్‌ అవసరాల దృష్ట్యా శ్రీశైలం నుంచి 35 వేల క్యూసెక్కుల నీటిని వదలడంతో సాగర్‌లోకి 27,805 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో ప్రాజెక్టు మట్టం 312 టీఎంసీలకుగాను 150 టీఎంసీలకు చేరింది.

మరిన్ని వార్తలు