మరో రెండు రోజులు ఇంతే..

21 Jun, 2015 19:58 IST|Sakshi
మరో రెండు రోజులు ఇంతే..

- వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కుండపోత
- అనేకచోట్ల 18 సెంటీమీటర్ల వరకు నమోదు


సాక్షి, హైదరాబాద్: అల్పపీడనం, రుతుపవనాల కారణంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేకచోట్ల అతి భారీ నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. వచ్చే 48 గంటలు కూడా ఇదే తరహాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ప్రధానంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు నమోదు చేసిన అంచనా ప్రకారం గత 24 గంటల్లో అత్యధికంగా 18 సెంటీమీటర్ల వరకు వర్షపాతాలు రికార్డు అయ్యాయి. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లా ఏటూరునాగారం, శాయంపేట్‌లలో 18, ఖానాపూర్, గుండాల, పరకాల, గూడూరులలో 17 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.

వెంకటాపురం, వెంకటాపూర్, చెన్నారావుపేటల్లో 16, గోవర్థన్‌పేట, కాళేశ్వరం, ములకలపల్లి, ములుగు, ఆత్మకూర్, కొత్తగూడెం, ఇల్లెందు, నర్సంపేటల్లో 15 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. పాల్వంచలో 14, పినపాక, భూపాలపల్లి, మహబూబాబాద్‌లలో 13, మణుగూరు, నల్లబెల్లిలలో 12, ఆదిలాబాద్, బయ్యారం, టేకులపల్లి, దుమ్ముగూడెం, చెన్నూరులలో 11 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. ఖమ్మం జిల్లాలో 319 శాతం అధిక వర్షపాతం నమోదయింది.

ఇదిలావుండగా ఈ సీజన్ మొదలైన జూన్ ఒకటో తేదీ నుంచి 21వ తేదీ (ఆదివారం) వరకు సాధారణంగా తెలంగాణలో సరాసరి 81.4 మిల్లీమీటర్ల (ఎం.ఎం.) వర్షం కురవాల్సి ఉండగా... ఏకంగా 190.3 ఎం.ఎం. వర్షం నమోదైంది. 134 శాతం అదనంగా కురిసింది. ఖమ్మం జిల్లాలోనైతే సాధారణంగా 87.3 ఎం.ఎం. కురవాల్సి ఉండగా... 366 ఎం.ఎం.లు కురిసింది. 319 శాతం అదనంగా కురిసింది. వరంగల్ జిల్లాలో సాధారణంగా 81.4 ఎం.ఎం.లు కురవాల్సి ఉండగా... 190.3 ఎం.ఎం.లు రికార్డు అయింది. ఇక్కడ 298 శాతం అదనంగా కురిసింది. ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలో మాత్రం 9 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఇప్పటివరకు తెలంగాణలోని మొత్తం 459 మండలాల్లో 317 మండలాల్లో అదనపు వర్షపాతం నమోదైంది. 98 మండలాల్లో సాధారణ వర్షపాతం రికార్డు అయింది. 33 మండలాల్లో లోటుంది. 11 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.

మరిన్ని వార్తలు