గాంధీ ఆస్పత్రి వద్ద గట్టి బందోబస్తు

10 Dec, 2019 12:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దిశ కేసులో నిందితుల మృతదేహాలను సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య మహబూబ్‌నగర్‌ మెడికల్‌ కాలేజీ నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. నిందితుల మృతదేహాలను భద్రపరిచే వ్యవస్థ మెడికల్‌ కాలేజీలో లేదంటూ పోలీసుల దృష్టికి కాలేజీ యాజమాన్యం తీసుకువచ్చింది. దీంతో పోలీసులు విషయాన్ని హైకోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో మృతదేహాలను గాంధీ ఆస్పత్రిలో భద్రపరచాలంటూ హైకోర్టు ధర్మాసనం అధికారులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు నిందితుల మృతదేహాలను పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలోని మార్చురీ 7, 8, 9, 10 నంబర్లు గల బాక్సులలో భద్రపరిచారు. మృతదేహాలు కుళ్లిపోకుండా వైద్యులు జాగ్రత్తలు తీసుకున్నారు. గాంధీ ఆస్పత్రి మార్చురీ సమీపంలో షాద్‌నగర్‌ పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.

మార్చురీ వద్ద భద్రతను సికింద్రాబాద్‌ గోపాలపురం ఏసీపీ వెంకటరమణ పర్యవేక్షించారు. ఇక, దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ జరుపుతున్న సిట్‌ బృందం మంగళవారం చటాన్‌పల్లికి వెళ్లనుంది. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ సమయంలో ఎన్‌కౌంటర్‌కు దారితీసిన పరిణామాలపై సిట్‌ విచారణ జరపనుంది. షాద్‌నగర్‌ పోలీసుల నుంచి ఎఫ్‌ఐఆర్‌తో పాటు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులను సిట్‌ పరిశీలించనుంది.

మరిన్ని వార్తలు