మృగశిరలోనూ మండే ఎండ..

12 Jun, 2019 10:30 IST|Sakshi

కౌటాల(సిర్పూర్‌): రోహిణి కార్తె వెళ్లి మృగశిర కార్తె వచ్చినా ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలు ఇంకా తగ్గడం లేదు. నైరుతి రుతుపవనాలు కానరాకపోవడంతో వాతావరణం ఇంకా మండు వేసవిలానే ఉంది. గత రెండు, మూడు రోజులు కాస్త చల్లబడినా మంగళవారం సూర్యుడు నిప్పులుకక్కాడు. జిల్లాలో ఆసిఫాబాద్‌లో 43.9 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదు కాగా కొన్ని ప్రాంతాల్లో 44 డిగ్రీలు కూడా నమోదు కావడం విశేషం. మరోవైపు తొలకరి పలకరించకపోవడంతో రైతులు ఖరీఫ్‌ సాగు పనులు నెమ్మదిగా చేసుకుంటున్నారు.సాధారణంగా మృగశిర కార్తెలో తొలకరి పలకరిస్తుంది. కాని ఈసారి రుతుపవనాలు ఆలస్యమవుతున్నాయి. దీంతో చినుకు జాడ కనిపించడం లేదు. జూన్‌ మొదటి వారంలో వాతావరణం కాస్త చల్లబడ్డా.. ప్రస్తుతం  వేసవిని మరిపిస్తుంది. ఇప్పటికే సాగు పనులు ప్రారంభించాల్సిన రైతులు తొలకరి కోసం వేచి చూస్తున్నారు. ఒకటి, రెండు భారీ వర్షాలు పడితే దుక్కులు దున్నేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతానికైతే చేనులలో పొరక ఏరే పనులు చేపడుతున్నారు. నేలను చదును చేసి వర్షం కోసంఎదురుచూస్తున్నారు. ఈనెల 13 నుంచి నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంటుంది. ఈ నేపథ్యంలో ఒకటి, రెండు రోజుల్లో తొలకరి పలకరిస్తే ఖరీఫ్‌ సాగు పనులు ముమ్మరం కానున్నాయి.

విద్యార్థులకు కష్టమే..
నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు మండిపోతుండడంతో విద్యార్థులపై ఎండ ప్రభావం పడే అవకాశముంది. జిల్లాలోని చాలా వరకూ పాఠశాలల్లో ఫ్యాన్లు, నీటి వసతి కూడా లేదు. ఈ నేపథ్యంలో ఎండలు ఇలాగే కొనసాగితే విద్యార్థులు ఉక్కపోతను భరించాల్సిందే. మరోవైపు అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్న పిల్లలు ఎండలతో ఇబ్బంది పడే అవకాశముంది. పగటి ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగితే వారం, రెండు వారాల పాటు ఒంటి పూట బడులు నిర్వహించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
 
మే నెలను మురిపిస్తూ..
జూన్‌ మొదటి వారంలో ఒకటి, రెండు రోజులు మినహా ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు మే నెలను మురిపిస్తున్నాయి. ఏ మాత్రం తగ్గని ఎండలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు కరెంట్‌ కోతలు పెరిగాయి. దీంతో ఇళ్లలో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అప్రకటిత విద్యుత్‌ కోతలతో రాత్రిళ్లు దోమలతో వేగలేకపోతున్నారు. సూర్య ప్రతానికి పగటి పూట రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మధ్యాహ్నం బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. చెట్ల కింద చిరువ్యాపారులు ఎండలతో ఇక్కట్లకు గురవుతున్నారు. మరోవైపు వడగాలులతో వేగలేకపోతున్నారు. ఇక వేసవిలో చికెన్‌ ధరలు మండిపోతుండగా పగటి ఉష్ణోగ్రతలతో పౌల్ట్రీల్లో బాయిలర్‌ కోళ్లు చనిపోతున్నాయి.

40కి పైగా డిగ్రీలు నమోదు..
సాధారణంగా జూన్‌ మాసంలో వర్షాలు ముంచెత్తుతాయని భావిస్తుంటారు. ఈసారి అందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. గతేడాది కూడా జూన్‌ 2నే తొలకరి పలకరించింది. కాని ఈసారి ఆ పరిస్థితి లేకుండా పోతుంది. ఇక గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం పెరుగుతున్నాయి. గత వారం రోజుల పరిస్థితి చూస్తే సోమవారం గరిష్ట ఉష్ణోగ్రత 44.9 డిగ్రీలు నమోదు కాగా రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు 29.7 నమోదయ్యాయి. ఆదివారం గరిష్టం 44.8 డిగ్రీలు కాగా కనిష్టం 28.4 డిగ్రీలుగా ఉన్నాయి. శనివారం గరిష్టం 41.9 డిగ్రీలు కాగా కనిష్ట ఉష్ణోగ్రతలు 25.5 డిగ్రీలు నమోదయ్యాయి. శుక్రవారం గరిష్ట ఉష్ణోగతలు 44.0 డిగ్రీలు నమోదయ్యాయి. ఇక గురువారం అత్యధికంగా గరిష్ట ఉష్ణోగ్రత 45.0 డిగ్రీలుగా నమోదు కాగా కనిష్టం 28.9 డిగ్రీలుగా ఉంది. బుధవారం కూడా జిల్లాలో పగటి ఉష్ణోగ్రత 44.4 డిగ్రీలు నమోదయ్యాయి. ఈ ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే మే నెలకు ఏ మాత్రం తీసిపోవడం లేదు. భానుడు కరుణించి తొలకరి పలకరిస్తే తప్పా ఉపశమనం లభించేలా లేదని అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు