జలపాతం.. జరభద్రం

12 Aug, 2019 08:58 IST|Sakshi
కుంటాల జలపాతం వద్ద పర్యటకులు 

విహారం కావొద్దు విషాదం

అజాగ్రత్తతోనే ప్రమాదాలు

తరుచుగా ప్రమాదాలు


సాక్షి, తిర్యాణి(ఆసిఫాబాద్‌) : వర్షాకాలంలో సరదాగా గడపాలని జలపాతాల వద్దకు వెళ్లడం పరిపాటి. జలపాతాల అందాలను తిలకించే సమయంలో ఆదమరిస్తే అంతే సంగతులు. ఆ రోజు ఆనందంగా గడపాల్సిన వారు చిన్నపాటి పొరపాటుతో విషాదాన్ని మిగుల్చుకుంటారు. ఉల్లాసంగా వెళ్లే పర్యాటకుల ప్రయాణం సాఫీగా సాగాలంటే జలపాతాల వద్ద కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మేలు.

ఆదమరిస్తే అంతే... 
ఒక్క చిన్నపాటి సరదాగా కుటుంబంలో తీరని వేదనను మిగుల్చుతోంది. విహారం కోసం వెళ్లితే ఆ రోజు అంతా సంతోషంగా గడపాలి కాని అది కాస్తా విషాదంగా మాత్రం మిగులకూడదు. జలపాతం అంటేనే దట్టమైన అడవి ప్రాంతంలో ఉండి ఎత్తైన కొండల మధ్యపై నుంచి నీరు కిందకు జలువారుతూ ఉంటుంది. ఇలాంటి ప్రదేశాలలో ఏమాత్రం ఆదమరిచి ఆజాగ్రత్తగా వ్యవహరించిన ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. అలాంటి సంఘటన గురువారం కుమురం భీం జిల్లా తిర్యాణి మండలంలోని చింతల మాదర జలపాతం వద్ద సంభవించింది. మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంకు చెందిన పోలవేణి కుమారస్వామి (22) అనే యువకుడు తన మిత్రులతో కలసి వచ్చి సరదాగా గడుపుతున్న సమయంలో మృతువు కబలించిన సంఘటన విదితమే. ఇది ఒక్కటే కాదు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 30 చిన్న చితక జలపాతలు ఉన్నాయి. ప్రతి ఏడాది పదుల సంఖ్యలో యువకులు జలపాతలు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. జలపాతాల వద్దకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటిస్తే మేలు.

లోతును అంచనా వేయలేం
వర్షాకాలంలో నీళ్లతో జలపాతాలు కనువిందు చేస్తుండడంతో వాటి లోతును అంచనా వేయలేకపోతాం. దీంతో పర్యాటకులు జలపాతంలో దిగి సెల్ఫీల కోసం పోటీ పడుతూ ఉంటారు. సెల్ఫీల మోజులో లోతుగా ఉన్న ప్రదేశాలకు వెళ్ళి ప్రాణాలను కోల్పోతున్న సంఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. జలపాతంలో ఎక్కువగా పెద్దపెద్ద బండలతో ఉండటం నిత్యం నీళ్ళలో ఉండడంతో వాటికి సాధారణంగా పాకురుపట్టి ఉంటుంది. కానీ పర్యాటకులు ఇది గమనించకుండా సెల్ఫీల కోసం ఎత్తున బండరాళ్లను ఎక్కి ఫొటోలు దిగే క్రమంలో జారీ లోతున్న ప్రదేశలు పడటం జరుగుతోంది. ఈతరాని వాళ్ళు ఇలాంటి ప్రయోగాలు చేయడంతోఈత రాక నీటిలో పడి (గల్లంతు) చనిపోతున్నారు.


మద్యంకు దూరంగా ఉంటే మేలు...
జలపాతాల సందర్శన కోసం వచ్చే పర్యాటకులు సరదాగా గడిపేందుకు జలపాతాల వద్దనే వనభోజనాలు చేస్తుంటారు. అంత వరకు ఆగకుండ ఆల్కహాల్‌కు తీసుకోవడం సమస్యకు కారణంగా మారుతుంది. ఎక్కువ శాతం పర్యాటకులు మద్యం సే వించి జలపాతంలో దిగడం ద్వారా మత్తులోని ఉత్తేజంతో ఈత రాకున్నా లోతుగా ఉండే ప్రదేశాలకు వెళ్లి బయటకు రాకుండా ప్రా ణాలను కోల్పోతు....తమ కుటుంబంలో విషాదాన్ని నింపుతున్నారు. మత్తుకు దూరంగా ఉంటే జలపాతాల్లో జరుగుతున్న ప్రమాదాలనుకొంతవరకు నియంత్రించవచ్చు.

రక్షణ చర్యలు కరువు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జలపాతల్లో రక్షణ చర్యలు పూర్తిగా కరువయ్యాయి. పర్యాటకులను వారించేందుకు ఎలాంటి సిబ్బంది ఉండకపోవడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.  ప్రభుత్వం జిల్లాలోని జలపాతాలను పర్యాటక ప్రాంతంగా గుర్తించి సెక్యూరిటీ పెంచి డెంజర్‌ జోన్‌ బోర్డులను ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలను కొంతమేర వరకు తగ్గించచ్చు.

జలపాతాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు 
→ పర్యాటకులు ఎట్టి పరిస్థితిలోనూ జలపాతం కొండలపై ఎక్కడం చేయకూడదు. ఎందుకంటే ఆ బండరాళ్లపై నిరంతరం నీళ్ళు ప్రవహిస్తూ ఉండటం ద్వారా అవి పాకురుబట్టి జారుడుతత్వంను కలిగి ఉంటుంది.
→ సెల్ఫీల కోసం జలపాతం లోపల ఉన్నా ఎత్తైన బండలను ఎక్కకూడదు. 
→ నీళ్లు అధికంగా ప్రవహిస్తున్న ప్రదేశంలో స్నానాలు చేయకూడదు.
→ జలపాతాలకు వెళ్తున్న సమయంలో ఆల్కాహాల్‌కు దూరంగా ఉండాలి.
→ ఈత వస్తే తప్ప జలపాతంలో దిగడానికి సహసించద్దు.
→ వర్షాలు అధికంగా పడుతున్న సమయంలో జలపాతాల వద్దకు వెళ్లకపోవడం మేలు.
→ సూర్యస్తమం వరకు అడవి నుంచి బయటకు వచ్చేలా ఫ్లాన్‌ చేసుకోవాలి. ఎందుకంటే రాత్రి సమయంలో అటవి జంతువుల సంచారం అధికంగా ఉండడం వాటి భారీన పడితే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. 
→ జలపాతాలకు ఒక్కరుగా కాకుండా గుంపులుగానే వెళ్లాలి.

మరిన్ని వార్తలు