కృష్ణా ప్రాజెక్టులకు జలకళ

14 Aug, 2019 02:37 IST|Sakshi
విజయవాడ ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తడంతో దిగువకు పరుగులు తీస్తున్న కృష్ణమ్మ

కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదతో స్థిరంగా నీటి ప్రవాహాలు 

సాక్షి, హైదరాబాద్‌ : కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదతో కృష్ణాలో నీటి ప్రవాహాలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్నమొన్నటితో పోలిస్తే బేసిన్‌ ప్రాజెక్టులకు కొద్దిమేర వరద ఉధృతి తగ్గినా భారీగానే వరద వస్తోంది. ఇప్పటికే ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులన్నీ నిండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. దీంతో సాగర్‌లోకి మంగవారం సాయంత్రం 8.14 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదుకాగా ప్రాజెక్టులో నీటినిల్వ 312 టీఎంసీలకుగాను 275 టీఎంసీలకు చేరింది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకుగాను 576 అడుగులకు చేరింది. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతిని దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టు నుంచి 5.35 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువనున్న పులిచింతలకు విడుదల చేస్తున్నారు. పులిచింతలలో సైతం ఎగువ వరదనుబట్టి నీటినిల్వ ఉంచి మరో 4.24 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఈ వరద ప్రకాశం బ్యారేజీ మీదుగా బంగాళాఖాతంలోకి వెళుతోంది. మరోవైపు నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు క్రస్ట్‌ గేట్ల ద్వారా 570 అడుగుల నుంచి కృష్ణమ్మ కిందికి దుముకుతుండటంతో ఆ సుందర దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు తరలి వస్తున్నారు. 

నేడు రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు 
రాష్ట్రంలో బుధవారం ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని, గురువారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

మరిన్ని వార్తలు