తక్కువ ఎత్తుంటే కండక్టర్‌ ఉద్యోగమివ్వరా!

3 May, 2017 01:24 IST|Sakshi
తక్కువ ఎత్తుంటే కండక్టర్‌ ఉద్యోగమివ్వరా!

టీఎస్‌ఆర్‌టీసీ చర్యలపై హైకోర్టు విస్మయం
సాక్షి, హైదరాబాద్‌:
ఎత్తు తక్కువ ఉన్నారన్న కారణంతో ఓ మహిళకు కారుణ్య నియామకం కింద కండక్టర్‌ పోస్టు ఇవ్వడానికి టీఎస్‌ఆర్‌టీసీ నిరాకరించడంపై ఉమ్మడి హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. కండర్‌ పోస్టుకు అవసరమైన ఇతర అర్హతలన్నీ ఉన్నప్పటికీ, ఎత్తు తక్కువ ఉన్నారన్న కారణంతో కారుణ్య నియామకాన్ని తిరస్కరించడానికి వీల్లేదంది. ఎత్తుతో నిమిత్తం లేకుండా బి.అన్నపూర్ణ, రహీమా, కె.అనితకు కండక్టర్‌ పోస్టులు ఇవ్వాలని ఆర్‌టీసీకి స్పష్టం చేసింది. ఈ ప్రక్రియను రెండు నెలల్లో పూర్తి చేయాలంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌రావు ఇటీవల తీర్పు వెలువరించారు.

గతంలో 150 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఎత్తు ఉన్న మహిళలకు కండక్టర్‌ పోస్టులు ఇచ్చారని, వారు ఇప్పుడు ఆ పోస్టుల్లో కొనసాగుతున్నారని న్యాయమూర్తి తన తీర్పులో గుర్తు చేశారు. తక్కువ ఎత్తు మహిళలు కండక్టర్‌ విధులను నిర్వర్తించేటప్పుడు గాయాలపాలయ్యే అవకాశం ఉందన్న ఆర్‌టీసీ వాదనలను న్యాయమూర్తి తోసిపుచ్చారు. మహిళల పట్ల వివక్షను రూపుమాపేందుకు అంతర్జాతీయ ఒప్పందంపై భారత్‌ సంతకం చేసిందని న్యాయమూర్తి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కీలకమైన ప్రభుత్వ సంస్థ టీఎస్‌ఆర్‌టీసీ ఉద్యోగ కల్పనలో వివక్షను రూపుమాపేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

మరిన్ని వార్తలు