మేడారం జాతరకు హెలికాప్టర్‌ సర్వీసులు

2 Feb, 2020 10:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సమ్మక్క - సారలమ్మల మహాజాతర సందర్భంగా పర్యాటకులు, భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ బేగం పేట విమానాశ్రయం నుండి మేడారంకు హెలికాప్టర్ సర్వీసులు ప్రారంభం అయ్యాయి. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ సేవలను అబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి  శ్రీనివాస్ గౌడ్ ఆదివారం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రారంభించారు.  టూరిజం ప్యాకేజీ లో భాగంగా బేగంపేట ఎయిర్ పోర్టు నుండి మేడారం, మేడారం నుండి  బేగం పేట ఎయిర్ పోర్టు వరకు  హెలికాఫ్టర్‌ సర్వీసులను నిర్వహిస్తున్నామన్నారు. (మేడారం జాతర: నిలువెత్తు దోపిడి)

హైదరాబాద్ నుండి ఆరుగురు ప్రయాణికులకు 1లక్ష 80 వేలుతో పాటు జీఎస్టీ ఉంటుందన్నారు. విమాన సర్వీసులతో పాటు సమ్మక్క, సారలమ్మ దర్శనం కల్పిస్తామని, అదేవిధంగా రూ.2999  అదనంగా చెల్లిస్తే మేడారం జాతరను హెలికాప్టర్‌ ద్వారా తిలకించేందుకు తెలంగాణ పర్యాటక శాఖ అద్బుత అవకాశం కల్పించిందన్నారు. పర్యాటకులు ఈ సదుపాయన్ని ఉపయోగించుకునేందు 9400399999  నంబర్‌ను సంప్రదించాలని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, టూరిజం చైర్మన్‌ భూపతి రెడ్డి,  రాష్ట్ర పౌర విమానయాన  శాఖ డైరెక్టర్ భరత్ రెడ్డి, టూరిజం ఎండీ  మనోహర్‌తో పాటు  పర్యాటక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (మేడారం జాతర : మండమెలిగె.. మది వెలిగె)

మేడారంకు ప్రత్యేక రైళ్లు

మేడారం జాతర సందర్భంగా సికింద్రాబాద్‌ నుంచి సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ నుంచి వరంగల్‌కు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేష్‌ శనివారం ఓ ప్రకటన చేశారు. ఈ మేరకు సికింద్రాబాద్‌-వరంగల్‌ (07014/07015) స్పెషల్‌ ట్రైన్‌ ఈ నెల 4వ తేదీ నుంచి 8 వరకూ ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు బయల్దేరి, మధ్యాహ్నం 3.40 గంటలకు వరంగల్‌ చేరుకుంటుంది. తిరిగి అదేరోజు సాయంత్రం 5.45కు వరంగల్‌ నుంచి బయల్దేరి రాత్రి 8.50 గంటలకు సికింద్రాబాద్‌ వస్తుంది. సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌-వరంగల్‌ (07017/07018) స్పెషల్‌ ట్రైన్‌ 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ ప్రతిరోజు ఉదయం 5.30 గంటలకు బయల్దేరి ఉదయం 9.30 గంటలకు వరంగల్‌ చేరుకుంటుంది. తిరిగి అదేరోజు ఉదయం 11 గంటలకు వరంగల్‌ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 3 గంటలకు సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ చేరుకుంటుంది. 

మరిన్ని వార్తలు