సర్కారు ఆర్డర్లన్నీ నేతన్నలకే.. 

11 Apr, 2018 02:41 IST|Sakshi

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు చేయూత: కేటీఆర్‌  

సాక్షి, సిరిసిల్ల: రాష్ట్రంలో ఇకపై ప్రభుత్వం నుంచి ఏ వస్త్రం కొనుగోలు చేసినా వాటి ఆర్డర్లు నేతన్నలకే దక్కుతాయని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. ఇప్పటికే వచ్చిన ఆర్డర్లతో సిరిసిల్లలో నేతన్నలకు నెలకు రూ.15 నుంచి రూ.25 వేల వేతనం అందుతుందని చెప్పారు. రాజన్న సిరిసిల్ల్ల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్, బీజేపీ, టీడీపీల నుంచి నలుగురు మున్సిపల్‌ కౌన్సిలర్లు టీఆర్‌ఎస్‌లో చేరారు.

సిరిసిల్ల నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే నంబర్‌ వన్‌గా నిలిపే వరకు విశ్రమించబోనని హామీ ఇచ్చారు. 24 గంటల కరెంటు, సాగు, తాగునీటితో పాటు రైతు బంధు పథకం ద్వారా ఏప్రిల్‌ 20న రైతన్నలకు ఎకరాకు రూ. 4 వేలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నందున రాజకీయాలకు తావు లేకుండా అభివృద్ధి దిశగా సాగాలని పార్టీ శ్రేణులను కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ భానుప్రసాద్, మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఇన్‌చార్జి బస్వరాజు సారయ్య, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు