రేషన్‌ తీసుకోని వారికీ సాయం

24 May, 2020 03:35 IST|Sakshi

అకౌంట్లలో రూ.1,500 జమ

2.08 లక్షల మందికి రూ.62.40 కోట్లు

ఏప్రిల్, మే నెలలకు కలిపి ఒక్కొక్కరికి రూ.3 వేలు

సాక్షి, హైదరాబాద్‌: వరుసగా మూడు నెలల పాటు రేషన్‌ తీసుకోకుండా ఏప్రిల్‌ నెలలో తీసుకున్న లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,500 నగదు సాయాన్ని అందించింది. ఈ ఏడాది వరుసగా జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో రేషన్‌ తీసుకోకుండా ఏప్రిల్‌ నెలలో 2.08 లక్షల మంది లబ్ధిదారులు రేషన్‌ తీసుకున్నారు. వీరికి ఏప్రిల్, మే రెండు నెలలకు కలిపి ఒక్కొక్కరికి రూ.3,000 చొప్పున మొత్తం రూ.62.40 కోట్లను వారి ఖాతాలో జమ చేసింది. దీంతో రేషన్‌ లబ్ధిదారులకు భారీ ఊరట లభించినట్లయింది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు వరుసగా 3 నెలలు 4.50 లక్షల మంది లబ్ధిదారులు కార్డు ఉండి కూడా రేషన్‌ తీసుకోలేదు. వీరిలో 2.08 లక్షల మంది ఏప్రిల్‌ నెలలో రేషన్‌ తీసుకున్నారు. అయితే మూడు నెలల పాటు రేషన్‌ తీసుకోని వారికి రూ.1,500 సాయాన్ని నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఏప్రిల్‌లో బియ్యం తీసుకున్న లబ్ధిదారులకు నగదు సాయం అందలేదు.

అయితే వరుసగా మూడు నెలల పాటు రేషన్‌ తీసుకోలేదన్న నిబంధనతో ప్రభుత్వ సాయాన్ని ఆపొద్దని హైకోర్టు సూచించిన నేపథ్యంలో ఏప్రిల్‌లో బియ్యం తీసుకున్న లబ్ధిదారులకు పౌర సరఫరాల శాఖ నగదు జమ చేసింది. మొత్తంగా ఏప్రిల్‌లో 74.07 లక్షల మంది, మే నెలలో 74.35 లక్షల మంది కార్డుదారులకు రూ.1,500 చొప్పున రూ.2,227 కోట్లను బ్యాంకు ఖాతాలో జమ చేశారు. బ్యాంకు ఖాతాలేని వారికి ఏప్రిల్‌లో 5.21 లక్షలు, మే నెలలో 5.38 లక్షల మంది కార్డుదారులకు పోస్ట్‌ ఆఫీసుల ద్వారా రూ.158.24 కోట్లు అందజేశారు. లబ్ధిదారులు భౌతిక దూరాన్ని పాటించి నగదు తీసుకోవాలని పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉచిత బియ్యానికి సంబంధించి ఇప్పటి వరకు 81.49 లక్షల మంది కార్డుదారులకు 3.25 లక్షల టన్నుల బియ్యాన్ని, 5,187 టన్నుల కంది పప్పును పంపిణీ చేశామని తెలిపారు.  

మరిన్ని వార్తలు