చిన్న పరిశ్రమకు చేయూత

7 May, 2019 02:46 IST|Sakshi

మూసివేత అంచున 3 వేలకు పైగా పరిశ్రమలు

గాడిన పెట్టేందుకు ఇండస్ట్రియల్‌ హెల్త్‌ క్లినిక్‌ సన్నాహాలు

పునరుద్ధరణకు వీలున్న పరిశ్రమలపై అధ్యయనం

41 పరిశ్రమలకు చేయూత, పరిశీలనలో మరో 14..

ఇటు రూ.100 కోట్ల నిధుల సమీకరణకు ప్రయత్నాలు

త్వరలో ఇతర రాష్ట్రాల్లోనూ టీఐహెచ్‌సీఎల్‌ సేవలు  

రాష్ట్రంలో నష్టాల బాటలో ఉన్న పరిశ్రమలను గట్టెక్కించేందుకు అవసరమైన నిధుల సేకరణపై కూడా ఇండస్ట్రియల్‌ హెల్త్‌ క్లినిక్‌ దృష్టి సారించింది. రాష్ట్రంలో 13,581 చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలుండగా, రూ.1,018 కోట్ల పెట్టుబడితో స్థాపించిన సూక్ష్మ పరిశ్రమలు 62 వేలకు పైగా మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. రూ.76,286 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన చిన్న తరహా పరిశ్రమలు సుమారు 75 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల యజమానుల్లో చాలా మందికి వ్యాపార దక్షత లేకపోవడం, మార్కెటింగ్‌ ఒడిదుడుకులతో ఆ పరిశ్రమలు కాస్తా నష్టాల బాట పడుతున్నాయి. అయితే ఇందులో సుమారు 3,700 పరిశ్రమలు 6 నెలలుగా కనీసం కరెంటు బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నట్లు ప్రభుత్వ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను తొలి దశలో హెల్త్‌ క్లినిక్‌ వడపోస్తున్నది. వీటిలో నిర్వహణ లోపం, మార్కెటింగ్‌ ఉన్నా వర్కింగ్‌ క్యాపిటల్‌ పెట్టే పరిస్థితి లేక నష్టాల్లో కూరుకుపోతున్న పరిశ్రమలను గుర్తిస్తున్నారు.     
– సాక్షి, హైదరాబాద్‌

నిధుల సమీకరణపై ప్రత్యేక దృష్టి
సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు నష్టాల పాలవ్వకుండా గాడిన పెట్టి దానిపై ఆధారపడిన కార్మికులు నష్టపోకుండా కాపాడేందుకు 2017లో రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ ఇండస్ట్రియల్‌ హెల్త్‌ క్లినిక్‌’ను ఏర్పాటు చేసింది. నష్టాల్లో ఉన్న పరిశ్రమల పునరుద్ధరణతో సరిపెట్టకుండా, వాటి వ్యాపార దక్షత పెంచే బాధ్యతను కూడా హెల్త్‌ క్లినిక్‌ లిమిటెడ్‌ (టీఐహెచ్‌సీఎల్‌) భుజాలకెత్తుకుంటోంది. తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ టీఎస్‌ఐడీసీ అడుగుజాడల్లో ఏర్పాటైన టీఐహెచ్‌సీఎల్‌ను రూ.100 కోట్ల మూలనిధితో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో రాష్ట్రం తన వంతు వాటాగా రూ.10 కోట్లు, కేంద్రం నుంచి రూ.50 కోట్లు వాటాగా చెల్లించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇప్పటివరకు రూ.7 కోట్లు విడుదల చేసినట్లు సమాచారం. మరో రూ.50 కోట్ల కార్పస్‌ ఫండ్‌ను ఏంజెల్‌ ఇన్వెస్టర్లు, వెంచర్‌ క్యాపిటలిస్టులు, బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్‌ సంస్థల నుంచి సేకరించాలని నిర్ణయించారు. హెల్త్‌ క్లినిక్‌ కార్యకలాపాలకు సలహాదారు, మేనేజింగ్‌ డైరెక్టర్, సీఈఓతో కూడిన బోర్డుతో పాటు వివిధ రంగాల్లో నిష్ణాతులతో ప్రత్యేక వ్యూహ బృందం కూడా పనిచేస్తోంది. ఏడుగురు సభ్యులున్న ఈ బృందంలో బ్యాంకింగ్, పాలన, పారిశ్రామిక రంగాలకు చెందిన నిపుణులు, అధికారులున్నారు. 

ఏడాది పాటు పర్యవేక్షణ
నష్టాల బాటలో ఉన్న పరిశ్రమలకు ఆర్థికంగా చేయూతనివ్వడంతో పాటు, వాటి పనితీరును ఇండస్ట్రియల్‌ హెల్త్‌ క్లినిక్‌ ఏడాది పాటు పర్యవేక్షిస్తోంది. సదరు పరిశ్రమలకు మార్కెటింగ్, ఉత్పత్తిలో మెళకువలపై కూడా హెల్త్‌ క్లినిక్‌ బృందాలు శిక్షణ ఇస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే సత్ఫలితాలు సాధిస్తున్న హెల్త్‌ క్లినిక్‌ పనితీరుపై ఇతర రాష్ట్రాల్లోనూ ఆసక్తి పెరుగుతోంది. రుణా గ్రస్త పరిశ్రమలను తిరిగి గాడిలో పెట్టడంపై తమకు సహకారం అందించాల్సిందిగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వినతులు అందుతున్నట్లు హెల్త్‌ క్లినిక్‌ అధికారులు చెప్తున్నారు. లోక్‌సభ ఎన్నికల పర్వం ఇతర రాష్ట్రాల్లోనూ కన్సల్టెన్సీ సేవలు అందించడంపై ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 

ఇప్పటివరకూ ఎన్ని.. ఇకపై ఎన్ని..
తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా 149 సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల పునరుద్ధరణపై ఇండస్ట్రియల్‌ హెల్త్‌ క్లినిక్‌ లిమిటెడ్‌ (టీఐహెచ్‌సీఎల్‌) దృష్టి సారించింది.  
ఇప్పటివరకు 41 పరిశ్రమలను పునరుద్ధరించగా, మరో 14 పరిశ్రమల స్థితిగతులపై అధ్యయనం జరుగుతోంది. పునరుద్ధరించిన పరిశ్రమల్లో అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 23, హైదరాబాద్‌లో 5, యాదాద్రి భువనగిరిలో 3, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 2 పరిశ్రమలున్నాయి.
​​​​​​​- ఇక  మేడ్చల్, జగిత్యాల, జనగామ, నల్లగొండ, కరీంనగర్‌ జిల్లాలో ఒక్కో పరిశ్రమను చొప్పున తిరిగి పట్టాలెక్కించారు. వీటిలో ఎక్కువగా మరమగ్గాలు, లోహ వస్తుత్పత్తికి సంబంధించిన పరిశ్రమలే ఉన్నాయి.  

మరిన్ని వార్తలు