థర్మల్ దెబ్బ

3 Jan, 2015 04:42 IST|Sakshi

దేవరకొండ: ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు.. ‘థర్మల్’ దెబ్బ దేవరకొండపైనే పడనుంది. దామరచర్ల మండలంలో నిర్మించతలపెట్టిన థర్మల్‌పవర్‌ప్లాంట్‌కు అవసరయ్యే 10 వేల భూములకు ప్రత్యామ్నాయంగా మరోచోట భూములిస్తేనే అటవీశాఖ నుంచి క్లియరెన్స్ వస్తుంది. అయితే మొదట నేరేడుచర్ల, మఠంపల్లి మండలాల్లో ఉన్న ప్రభుత్వ భూములను సేకరిస్తామని భావించినా, ఇప్పుడు జిల్లాయంత్రాంగం ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్టు సమాచారం.

తాజాగా దేవరకొండ నియోజకవర్గపరిధిలోని ప్రభుత్వ భూములను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం ప్రత్యేక దృష్టి సారించడంతో, జిల్లా అధికారులు అటవీశాఖ పరిధిలోని భూముల్లో ఆగమేఘాల మీద సర్వే చేశారు. పనిలోపనిగా శుక్రవారం దేవరకొండ రెవెన్యూ అధికారులతో పాటు జిల్లా అటవీశాఖ అధికారులు చందంపేట మండలంలో పర్యటించారు.

ప్రభుత్వభూమి..పదివేల ఎకరాలు
దేవరకొండ నియోజకవర్గంలోని ప్రభుత్వ భూముల వివరాలను జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే సేకరించింది. చందంపేట మండలంలో 3700 ఎకరాలు, దేవరకొండలో 1700 ఎకరాలు, డిండిలో 3032, పీఏపల్లి మండలంలో 988 ఎకరాలు, చింతపల్లిలో సుమారు వెయ్యి  ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు గుర్తించారు.

అయితే ప్రభుత్వం అటవీశాఖకు అప్పగించదలుచుకున్న 7500 ఎకరాల్లో  6500 ఎకరాలు దేవరకొండ నియోజకవర్గం నుంచే సేకరించాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. చందంపేట, డిండి మండలాల పరిధిలో నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉండడంతో ఈ భూమి ఫారెస్ట్ ఆధీనంలోకి తీసుకోవడానికి అటవీశాఖ అధికారులు కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది.
 
జనంలో.... గుబులు :
గతంలో పీఏపల్లి మండలం పెద్దగట్టు, చందంపేట మండలం చిత్రియాల అటవీ ప్రాంతాల్లో యురేనియం నిల్వలను కేంద్రప్రభుత్వం గుర్తించింది. అక్కడ వెలికితీసే యురేనియం నిక్షేపాలను శుద్ధి చేయడం కోసం దేవరకొండ మండలంలోని శేరిపల్లి అనువైందిగా భావించింది. అక్కడున్న 500 ఎకరాల్లో యురేనియం శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేయాలనియూసీఐఎల్ భావించింది. ఇందు కోసం శేరిపల్లి ప్రాంతంలో సర్వే కూడా నిర్వహించారు. జేత్యతండా సమీపంలో అధికారుల నివాసానికి రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని ఇవ్వాల్సిందిగా,  జిల్లా అధికారుల నుంచి రెవెన్యూ అధికారులకు ఆదేశాలు కూడా వచ్చాయి.

ప్రస్తుతం ఈ విషయం స్తబ్దుగా ఉన్నప్పటికీ, గతంలో యురేనియం ప్లాంట్‌కు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఇదే క్రమంలో చందంపేట మండలంలో ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం పనులు జరుగుతుండగా, నక్కలగండి ప్రాజెక్టు కోసం ముంపునకు గురయ్యే 3వేల ఎకరాలకు భూమిని సేకరించే పనిలో ప్రభుత్వం ఉంది. అక్కడ కేవలం 300 ఎకరాలు మాత్రమే సేకరించగా, ముంపు బాధితుల నుంచినిరసన గళం వినిపిస్తూనే ఉంది.

ఇప్పటికే నాగార్జునసాగర్ ముంపునకు గురైనప్పుడు తెల్దేవర్‌పల్లిలో ఆవాసాలు కల్పించగా,  మళ్లీ  అదే ప్రాంతం నక్కలగండి ప్రాజెక్టులో ముంపునకు గురవుతుంది. వారికి ఇంకా ప్రభుత్వ భూమిని ప్రత్యామ్నాయంగా చూపించనేలేదు. నూతన భూసేకరణ చట్టం నిబంధనల ప్రకారం వారు ప్రత్యామ్నాయ ప్రభుత్వ భూములను డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో థర్మల్ పవర్ ప్లాంట్‌కు చందంపేట, డిండి ప్రభుత్వ భూములను ప్రత్యామ్నాయంగా భావించడం..అధికారగణం ఇందుకు సంబంధించిన సర్వేలు చేస్తుండడంతో ఈ ప్రాంతవాసుల్లో గుబులు మొదలయ్యింది.

మరిన్ని వార్తలు