సిటీకి రూ.50 లక్షల హెరాయిన్‌! 

21 May, 2018 07:24 IST|Sakshi

ఇండోర్‌ నుంచి అక్రమ రవాణాకు ప్రయత్నించిన ముఠా 

ప్రధాన సూత్రధారిని పట్టుకున్నడీఆర్‌ఐ అధికారులు 

స్థానికంగా ఉన్న నెట్‌వర్క్‌పై లోతుగా సాగుతున్న దర్యాప్తు 

రూ.50 లక్షల విలువైన హెరాయిన్‌ స్వాధీనం

నగరంలో కొంతకాలంగా సద్దుమణిగిన మాదకద్రవ్య క్రయవిక్రమాలు మళ్లీ జోరందుకోనున్నాయా..? ఉత్తరాదికి చెందిన ముఠాలు ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయా? ఔననే అంటున్నారు పోలీసులు. సిటీకి హెరాయిన్‌ రవాణా చేయడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని రెండు రోజుల క్రితం నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు మధ్యప్రదేశ్‌లోని ధార్‌ జిల్లాలో పట్టుకున్నారు. ఇతడి నుంచి రూ.50 లక్షల విలువైన 480 గ్రాముల హెరాయిన్‌ స్వాధీనం చేసుకున్నారు. ఇతగాడి విచారణలోనే తన నేతృత్వంలోని గ్యాంగ్‌ హెరాయిన్‌ను హైదరాబాద్‌కు రవాణా చేయడానికి పథక రచన చేసినట్లు వెలుగులోకి వచ్చింది. నగరంలో లభించే మాదకద్రవ్యాల్లో గంజాయి మినహా మిగిలినవి అన్నీ బయట రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా అయ్యేవే. 
– సాక్షి, సిటీబ్యూరో      

సాక్షి, సిటీబ్యూరో : నగరంలో మళ్లీ హెరాయిన్‌ విక్రయాలకు రంగం సిద్ధమైనట్లు తెలియడంతో పోలీసులు అలర్టయ్యారు. మాదక ద్రవ్యాల ముఠాల ఆటకట్టించేందుకు వ్యూవహరచన చేస్తున్నారు. ప్రధానంగా ముంబై, గోవాలకు చెందిన ముఠాలు సిటీకి డ్రగ్స్‌ రవాణా చేయడంలో కీలక పాత్ర పోషించేవి. నగరంలో దళారుల్ని ఏర్పాటు చేసుకుని వీటి విక్రయాలు సాగించేవి. అయితే ఓ పక్క ఎక్సైజ్‌ అధికారులతో పాటు మరోపక్క సిటీ టాస్క్‌ఫోర్స్‌ బృందాలు, సైబరాబాద్, రాచకొండలకు చెందిన స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్స్‌ మాదకద్రవ్యాలపై నిఘా ముమ్మరం చేశాయి. గడిచిన ఏడాదిన్నర కాలంలో వరుసగా ముఠాలను పట్టుకుని రవాణాకు చెక్‌ చెప్పాయి. ఇలా చిక్కిన వారిలో ఉత్తరాదితో పాటు నగరంలోనూ స్థిరపడిన నైజీరియన్లు సైతం ఉన్నారు.

ఈ నెట్‌వర్క్స్‌ పూర్తిగా ధ్వంసం కావడంతో ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ కేంద్రంగా పని చేస్తున్న మాదకద్రవ్య ముఠాల కన్ను సిటీపై పడినట్లు తెలుస్తోంది. అక్కడి మందసోర్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి భారీ ముఠా ఏర్పాటు చేసి రంగంలోకి దిగాడు. వివి«ధ మార్గాల్లో సేకరించిన హెరాయిన్‌ను తన నెట్‌వర్క్‌ ద్వారా సిటీకి తరలించి, ఇక్కడున్న ముఠాలకు సరఫరా చేస్తున్నాడు. అక్రమ రవాణాకు ఎవరీకి అనుమానం రాని వస్తువులు, విధానాలను అనుసరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గత వారం చెక్క ఫ్రేముల్లో 480 గ్రాముల హెరాయిన్‌ నింపుకుని మందసోర్‌ నుంచి బయలుదేరాడు. మధ్యప్రదేశ్‌ రాజధాని ఇండోర్‌కు చేరుకున్న ఇతడు అక్కడ నుంచి బస్సులో హైదరాబాద్‌కు బయలుదేరాడు. దీనిపై సమాచారం అందుకున్న ఎన్సీబీ అధికారులు అక్కడి ధార్‌ జిల్లాలో ఉన్న మన్‌పూర్‌లో బస్సును అడ్డుకున్నారు. త

నిఖీలు చేసిన బృందాలు డ్రగ్‌ను పట్టుకుని అతడిని అదుపులోకి తీసుకున్నాయి. ఈ నెట్‌వర్క్‌లో ఉన్న మిగిలిన సభ్యులతో పాటు వీరి నుంచి డ్రగ్‌ తీసుకుంటున్న సిటీకి చెందిన వారిని గుర్తించడంపై అధికారులు దృష్టి పెట్టారు. తమకు చిక్కిన ప్రధాన సూత్రధారి అని, కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు పేరు సహా మరే ఇతర వివరాలు వెల్లడించమని స్పష్టం చేస్తున్నారు. ఈ నెట్‌వర్క్‌పై సమాచారాన్ని ఇండోర్‌ అధికారులు హైదరాబాద్‌లో ఉన్న ఎన్సీబీ కార్యాలయానికీ సమాచారం ఇచ్చారు. ఈ గ్యాంగ్‌ నుంచి హెరాయిన్‌ ఖరీదు చేయడానికి సిద్ధమైన సిటీ ముఠా ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిసింది. వీరిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.   

మరిన్ని వార్తలు