కొన్నాళ్లక్రితం.. నటి ప్రణీతకు తప్పిన ముప్పు..

30 Aug, 2018 11:16 IST|Sakshi

జూనియర్‌ ఎన్టీఆర్‌కు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

కారును అతివేగం.. అజాగ్రత్తతో నడిపినట్లుగా నిర్ధారించిన అప్పటి పోలీసులు

కొంపముంచిన సొంత డ్రైవింగ్‌

మరో ఘటనలో నటి ప్రణీతకూ తప్పిన ముప్పు

తాళ్లగడ్డ (సూర్యాపేట) : సరిగ్గా తొమ్మిది సంవత్సరాల ఐదునెలల క్రితం ప్రముఖ సినీ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌కు రోడ్డు ప్రమాదం జరిగిందని తెలియడంతో రాష్ట్రమంతా ఉలిక్కిపడింది. ఒక్కసారిగా కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. మోతె మండల కేంద్రం సమీపంలోని తిరుపతమ్మగుడి మూలమలుపు వద్ద సూర్యాపేట ఖమ్మం ప్రధాన రహదారిపై 2009 మార్చి 26వ తేదీ అర్ధరాత్రి జూనియర్‌ ఎన్టీఆర్‌కు జరిగిన ప్రమాదం ఒక్కసారిగా అలజడి సృష్టించింది. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారసభలో పాల్గొని హైదరాబాద్‌కు తిరిగి వెళ్తున్న జూనియర్‌ ఎన్టీఆర్‌ వాహనం అదుపు తప్పి పల్టీ కొట్టింది.

 దీంతో జూనియర్‌ ఎన్టీఆర్‌తో సహా పలువురికి గాయాలు కాగా ఒకరికి తీవ్ర గాయాలైన విషయం విధితమే. వీరికి సూర్యాపేటలోని న్యూలైఫ్‌ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. కాగా అతివేగం, అజా గ్రత్తగా వాహనం నడిపి పలువురికి గాయాలు కావడానికి కారణమయ్యారని మోతె పోలీసులు నిర్ధారించారు. వాహనంలో జూనియర్‌ ఎన్టీఆర్‌తో పాటు అప్పటి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, చంద్రమౌళి ప్రసాద్, బాబావలి, రాజీవ్‌కనకాల ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సూర్యాపేటలోని న్యూలైఫ్‌ ఆస్పత్రికి సుమారు ఆరు వాహనాల్లో 15మంది వరకు చేరుకున్నారు. 

జూనియర్‌ ఎన్టీఆర్‌కు తప్పిన పెను ప్రమాదం
మోతె మండల కేంద్రంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రయాణిస్తున్న కారు మితిమీరిన వేగంతో వెళ్లి అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఆ మూలమలుపు వద్ద పెద్ద బావి ఉంది. కానీ కొద్దితేడాతో కారు ఆగిపోవడంతో ప్రాణనష్టం నుంచి తప్పినట్లయింది.  

నాడు జూనియర్‌ ఎన్టీఆర్‌ సొంత డ్రైవింగ్‌..
ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగించుకుని అర్ధరాత్రి బయలుదేరారు. తన స్నేహితులతో కలిసి సఫారీ కారును సొంతంగా జూనియర్‌ ఎన్టీఆరే డ్రైవింగ్‌ చేస్తూ వచ్చారు. మోతె సమీపంలోకి రాగానే.. అతివేగంగా నడుపుతున్న కారుఅదుపు చేయలేకపోవడంతో ప్రమాదానికి గురైంది. 

ప్రమాదకర మలుపు..
జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రయాణిస్తున్న కారుబోల్తా పడిన స్థలం వద్ద ఇప్పటికీ ఎన్నోమార్లు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఒకసారి బస్సుబోల్తా కొట్టింది. కాకినాడ మున్సిపల్‌ కమిషనర్‌ వాహనం కూడా ఇదే మలుపు వద్ద బోల్తా పడింది. 2008లో బస్సును ఆటో ఢీకొట్టిన ఘటనలో 13 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రమాదానికి నెల రోజుల క్రితం లారీ బావిలోపడి ఇద్దరు మృతిచెందారు.

నటి ప్రణీతకు తప్పిన ముప్పు..
మోతె మండల కేంద్రంలో జూనియర్‌ ఎన్టీఆర్‌కు తప్పిన ప్రమాదానికి కూతవేటు దూరంలోని మూ లమలుపు వద్దనే నటి ప్రణీత ప్రయాణిస్తున్న కారు 2016 ఫిబ్రవరి 14 పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్‌ వెంకటేశ్వరరావు, మేకప్‌ అసిస్టెంట్‌ విజయలక్ష్మికి స్వల్ప గాయాలయ్యాయి. కానీ నటి ప్రణీతకు మాత్రం ఎలాంటి గాయం కూడా కాకుండా బయటపడింది.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా