వానా వానా చాలప్ప!

15 Oct, 2017 01:45 IST|Sakshi

348% అధిక వర్షపాతం నమోదు

సాక్షి, హైదరాబాద్‌ :  గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్‌ మహా నగరం తడిసి ముద్దయింది. అధిక వర్షాలతో జనజీవనం అతలాకుతలమైంది. రోడ్లు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల రోడ్లపై పడవలతో జనం రవాణా సాగించారు. ఇంతస్థాయిలో వర్షం పడటంపై వాతావరణ శాఖ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నాయి. అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు ఈ 14 రోజుల్లో నగరంలో 348 శాతం అధిక వర్షపాతం నమోదు కావడం విస్మయం కలిగిస్తోంది.

నైరుతి రుతుపవనాలు నిష్క్రమించే వేళ ఇంతస్థాయిలో వర్షాలు కురవడం వాతావరణ శాఖ వర్గాలను నివ్వెరపరిచింది. రబీ ప్రారంభమైన ఈనెల ఒకటో తేదీ నుంచి 14వ తేదీ వరకు సాధారణంగా హైదరాబాద్‌లో 51 మిల్లీమీటర్ల వర్షం కురవాలి. అయితే ఏకంగా 228.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఒక్కోరోజు 12 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదు కావడం గమనార్హం.

ఇక పాత రంగారెడ్డి జిల్లాలో ఇదే సమయంలో సాధారణంగా 56.5 మి.మీ. వర్షపాతం కురవాల్సి ఉండగా, 141.7 మి.మీ. వర్షపాతం నమోదైంది. అంటే ఏకంగా 151 శాతం అధిక వర్షపాతం రికార్డయింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఇదే సమయంలో సాధారణంగా 52.7 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 96.5 మి.మీ. వర్షం కురిసింది. ఆ ప్రకారం సాధారణం కంటే 83 శాతం అధిక వర్షపాతం నమోదైంది.

ఖరీఫ్‌లో 13 % లోటు.. రబీ ఆశాజనకం
ఈ ఏడాది ఖరీఫ్‌లో జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య 13 శాతం లోటు వర్షపాతం నమోదైంది. జూన్‌లో 49 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా, జూలైలో 41 శాతం లోటు నమోదై పరిస్థితి తిరగబడింది. ఆగస్టులో 8 శాతం, సెప్టెంబర్‌లో 30 శాతం లోటు వర్షపాతమే నమోదైంది. లోటు వర్షపాతం కారణంగా ఖరీఫ్‌లో రాష్ట్రంలో 184 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.

307 మండలా ల్లో సాధారణ, 92 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. అయితే రబీ మొదలైన ఈ 14 రోజుల్లో 83 శాతం అధిక వర్షపాతం నమోదు కావడం గమనార్హం. ఖరీఫ్‌లో వరి నాట్లు నిరాశాజనకంగా ఉన్నాయి. 86 శాతానికి మించలేదు. జలాశయాలు నిండక అనేక చోట్ల నాట్లు పడలేదు.

ఈసారి రబీ ప్రారంభంలోనే అధిక వర్షాలు కురుస్తుండటం, జలాశయాలు, చెరువులు నిండుతుండటంతో పరిస్థితి ఆశాజనకంగా ఉంది. గతేడాది ఖరీఫ్‌ కంటే రబీలోనే పంట దిగుబడులు గణనీయంగా పెరిగాయి. అప్పట్లో సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాలు నాటి రబీ గతినే మార్చేశాయి. ఈసారి కూడా రబీ బాగుంటుందని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి.

20 తర్వాత వర్షాలు తగ్గుముఖం
ఐదారు రోజుల్లో రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించనున్నాయి. దీంతో వర్షాలు తగ్గుముఖం పడతాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు.. రానురాను తగ్గుముఖం పడతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. వాస్తవంగా నైరుతి రుతుపవనాలు సెప్టెంబర్‌ నెలాఖరు వరకు ఉంటాయి.

ఒక్కోసారి అక్టోబర్‌ 15 వరకు కొనసాగుతాయి. ఈసారి మాత్రం 20వ తేదీ వరకు ఉండనున్నాయి. నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా నిష్క్రమించడం అసాధారణ విషయమేమీ కాదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. వాతావరణంలో పెనుమార్పులకు ఇది సూచిక కాదని స్పష్టం చేశారు.


నగరాన్ని వీడని వాన
నగరంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షం శనివారం కూడా కొనసాగింది. అత్యధికంగా రాజేంద్రనగర్‌లో రాత్రి 9 గంటల వరకు 9.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. షాపూర్‌నగర్, కుత్బుల్లాపూర్‌లో 3 నుంచి 4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. గోల్కొండ, పాశమైలారం తదితర ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షం కురిసింది.

ఇటీవల కురిసిన వరుస వర్షాలతో నీట మునిగిన మల్కాజిగిరి, హబ్సిగూడతోపాటు పలు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల ఇబ్బందులు ఇంకా కొనసాగుతున్నాయి. బేగంపేట బ్రాహ్మణవాడిలో నాలాలోని నీరు 5 అడుగుల మేర ఇళ్లలోకి చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు