ఉత్తుత్తి ఫోన్‌కాల్‌తో ఉరుకులు, పరుగులు

7 Jul, 2019 02:41 IST|Sakshi
పోలీసుల అదుపులో కె.వి.విశ్వనాథన్‌

విమానాల్లో బాంబులున్నాయని బెదిరింపు 

మద్యంమత్తులో విఫలప్రేమికుడి నిర్వాకం 

తనిఖీలు చేపట్టిన సీఐఎస్‌ఎఫ్, ఆర్‌జీఐ పోలీసులు 

పోలీసుల అదుపులో నిందితుడు 

శంషాబాద్‌: ఓ భగ్నప్రేమికుడి నిర్వాకానికి విమానాశ్రయ భద్రతాసిబ్బంది, పోలీసులు హైరానా పడ్డారు. విమానంలో బాంబులున్నాయంటూ ఫోన్‌ చేయడంతో హడలెత్తిపోయారు. పోలీసులు, భద్రతాసిబ్బంది ఉరుకులు, పరుగుల మీద విమానాల్లో తనిఖీలు చేపట్టారు. చివరికి అది ఉత్తుత్తిదేనని తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటన రోజే బెదిరింపు కాల్‌ రావడంతో పోలీసులు టెన్షన్‌ పడ్డారు. వివరాలు... శంషాబాద్‌ విమానాశ్రయానికి శనివారం ఉదయం 7 గంటలకు ఓ యువకుడు ఫోన్‌ చేసి ఇండిగో 6ఈ–188 విమానంతోపాటు ట్రూజెట్‌ 2టీ 201 చెన్నై విమానంలో బాంబులున్నాయని చెప్పాడు. దీంతో సీఐఎస్‌ఎఫ్, ఆర్‌జీఐఏ పోలీసులు వెంటనే అప్రమత్తమై రెండు విమానాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అణువణువూ గాలించారు. విమానాల్లో బాంబులేమీ లేవని నిర్ధారించారు.

అనంతరం విమానాలు ఇక్కడి నుంచి టేకాఫ్‌ తీసుకున్నాయి. శంషాబాద్‌ డీసీపీ ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నకిలీ ఫోన్‌ కాల్‌ చేసినవ్యక్తి కె.విశ్వనాథన్‌(24)గా గుర్తించారు. తమిళనాడులోని చెన్నై తెయ్‌నంపేట్‌కు చెందిన విశ్వనాథన్‌ సికింద్రాబాద్‌లోని గ్లోబ్‌లింక్‌ డబ్ల్యూడబ్ల్యూ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. ట్రూజెట్‌ 2టీ201 విమానంలో చెన్నై బయలుదేరడానికిగాను ఉదయం ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రేమ విఫలం కావడంతో తాను మానసికంగా ఇబ్బందిలో ఉన్నానని విశ్వనాథన్‌ పోలీసుల విచారణలో వెల్లడించాడు. భద్రతకు భగ్నం కలిగించినందుకుగాను అతడిపై పౌర విమానయాన చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు. 

కేంద్ర హోంమంత్రి వచ్చే సమయంలోనే... 
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పర్యటన ఉన్న సమయంలో బాంబు బెదిరింపు ఫోన్‌ కాల్‌ రావడంతో పోలీసులు టెన్షన్‌ పడ్డారు. తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు. ఫోన్‌కాల్‌ వచ్చిన కొద్ది గంటల్లోనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అది కేవలం బెదిరింపు కాల్‌ అని తేలడంతో పోలీసులు, భద్రతాసిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు