గోదావరి ఉగ్రరూపం 

22 Aug, 2018 01:24 IST|Sakshi
భద్రాచలంలో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది

భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక  

వరద ప్రభావిత ప్రాంతాల్లో హై అలర్ట్‌ 

నిజామాబాద్‌ జిల్లాలో రెండు పునరావాస కేంద్రాల ఏర్పాటు

భద్రాచలం/నిజామాబాద్‌ అర్బన్‌: భద్రాచలం వద్ద గోదావరి నది పోటెత్తుతోంది. మంగళవారం రాత్రి 50 అడుగులకు చేరువైంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ ప్రాంతంలోని కాళేశ్వరం, పాతగూడెం, ఏటూరునాగారం వద్ద భారీగా వరద ఉధృతి ఉందని కేంద్ర జలవనరుల సంఘం అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో.. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలైన జిల్లాలోని భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, బూర్గుంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. భూపాలపల్లి జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాలకు కూడా వరద తాకిడి తీవ్రంగానే ఉంది.

ఎగువ ప్రాంతంలోని ప్రాజెక్టుల నుంచి వరద నీరు ఉధృతంగా వస్తుండటం, దిగువన ఉన్న శబరి నది కూడా ఉగ్రరూపం దాల్చడంతో భద్రాచలం వద్ద బుధవారం నాటికి నీటి మట్టం 53 అడుగులకు చేరుకోవచ్చని, మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయాల్సి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుత వరద ప్రవాహంతో భద్రాచలం నుంచి చర్ల, వాజేడు రహదారిలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 50 అడుగులు దాటితే దారులన్నీ మూసుకుపోయే ప్రమాదం ఉంది. చింతూరు మండలం చట్టి వద్ద జాతీయ రహదారిపై వరద నీరు ఐదు అడుగుల మేర నిల్వ ఉండటంతో చింతూరు, ఛత్తీస్‌గఢ్‌ వైపు వెళ్లే వాహనాలను నిలిపివేశారు.  

నిజామాబాద్‌లో దెబ్బతిన్న 601 ఇళ్లు  
నిజామాబాద్‌ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల 601 ఇళ్లు దెబ్బతిన్నాయి. అధికారులు రెండు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని బాబాసాహెబ్‌పహాడ్‌లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి 150 మందికి వసతి కల్పించారు. నిజామాబాద్‌ నగర శివారు ప్రాంతమైన గూపన్‌పల్లిలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి 60 మందికి వసతి కల్పించారు. జిల్లా వ్యాప్తంగా 168 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. రూ. మూడున్నర కోట్ల నష్టం వాటిల్లింది. గుండారం వద్ద వరదలకు రోడ్డు తెగిపోయింది. సిరికొండ మండలం తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. నవీపేట మండలం జన్నేపల్లి గ్రామ సమీపంలో ఉన్న డైవర్షన్‌ రోడ్డు కొట్టుకుపోయింది.

మరిన్ని వార్తలు