కాళేశ్వరం వద్ద పటిష్ట భద్రత

15 Mar, 2020 05:38 IST|Sakshi

రంగంలోకి మావోయిస్టు యాక్షన్‌ టీంలు

అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం

మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు, పంప్‌హౌస్‌లపై నిఘా

కాళేశ్వరం: ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో మావోయిస్టుల యాక్షన్‌ టీంలు సంచరిస్తున్నట్లు ఇంటెలిజెన్స్‌ అధికారులు హెచ్చరించడంతో తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దుల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్దుల్లో మావోల కదలికలపైన నాలుగు రోజులుగా తనిఖీలు చేపడుతున్నారు. అందులో భాగంగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన, మేడిగడ్డ బ్యారేజీల పైనుంచి మహారాష్ట్ర–తెలంగాణకు వస్తున్న వాహనాలను తనిఖీ చేస్తున్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్నందున జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పోలీసులు తెలంగాణ వైపు గల మహదేవపూర్, పలిమెల, మహాముత్తారం మండలాల్లో గోదావరి దాటి జిల్లాలోకి ప్రవేశించకుండా అప్రమత్తమయ్యారు. గోదావరి ప్రవాహం తగ్గుతుండటంతో అటువైపున పోలీసులు దృష్టి పెట్టారు. మహదేవపూర్‌ మండలంలోని మేడిగడ్డలోని లక్ష్మీ, అన్నారంలోని సరస్వతీ బ్యారేజీ, కన్నెపల్లిలోని లక్ష్మీ పంప్‌హౌస్, గ్రావిటీ కాల్వల వద్ద ప్రత్యేక పోలీసు బలగాలు, సివిల్‌ పోలీసులు పహారా కాస్తున్నారు. జిల్లా ఇన్‌చార్జ్‌ ఎస్పీ సంగ్రామ్‌సింగ్, ఓఎస్డీ శోభన్‌కుమార్, అడిషనల్‌ ఎస్పీ శ్రీనివాసులు, కాటారం డీఎస్పీ బోనాల కిషన్, సీఐలు నర్సయ్య, హతిరాం, కాళేశ్వరం ఎస్సై శ్రీనివాస్‌ల ఆధ్వర్యంలో బ్యారేజీలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సీఆర్‌పీఎఫ్, డిస్ట్రిక్ట్‌ గార్డ్స్, సివిల్‌ పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు.

మరిన్ని వార్తలు