జిల్లాలో టెన్షన్‌.. 370

6 Aug, 2019 12:35 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికర్‌ 370 ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో జిల్లా కేంద్రంలో సంబరాలు జరుపుకున్న బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఉదయం నుంచే ముందస్తుగా జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో పోలీసు బలగాలను జిల్లా యంత్రాంగం మోహరించింది. కాగా నగరంలోని ఎన్టీఆర్‌ చౌరస్తా వద్ద బీజేపీ నేతలు సంబరాలు చేసుకునేందుకు సిద్ధం అయ్యారు. పోలీసులు అడ్డుకుని పలువురిని నాలుగో టౌన్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పదిన్నర గంటల వరకు బీజేపీ నేతలు ఠాణా వద్ద నిరసన వ్యక్తం చేశారు. చివరకు పోలీసులు అరెస్టయిన వ్యక్తిగత పూచీ కత్తుపై విడుదల చేశారు. అరెస్టయిన వారిలో బీజేపీ నేతలు జైపాల్, పటేల్, భగత్‌ తదితరులు ఉన్నారు.

కామారెడ్డి: జమ్మూ కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి (ఆర్టికల్‌ 370) రద్దు నేపథ్యంలో జిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించారు! జమ్మూ, కాశ్మీర్‌పై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. జిల్లాలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. దీంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. జమ్మూకాశ్మీర్‌ స్వయంప్రతిపత్తికి సంబంధించి ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం రాజ్యసభలో కీలక ప్రకటన చేసింది. అలాగే, ఇందుకు సంబంధించిన నాలుగు బిల్లులను ప్రవేశపెట్టి, పాస్‌ చేయించుకుంది. అయితే, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంపై జిల్లా వ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది.

ఈ అంశంపై సోషల్‌ మీడియా వేదికగా చర్చ జోరందుకుంది. ఈ నేపథ్యంలో అనుకూలురు, వ్యతిరేకుల మధ్య వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండలాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశాలు ఉన్న ప్రాంతాలపై నిఘా ఉంచారు. పోలీసు అధికారులు స్థానికంగా అందుబాటులో ఉండాలని ఆదేశాలు వచ్చినట్టు తెలిసింది. పిట్లం మండల కేంద్రంలో ఇటీవల జరిగిన భారీ చోరీ కేసులో నిందితుల అరెస్టు వివరాలు వెల్లడించేందుకు ఎస్పీ ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో ఎస్పీ విలేకరుల సమావేశాన్ని కూడా రద్దు చేసుకున్నారు. అరెస్టు వివరాలను ప్రెస్‌నోట్‌ ద్వారా వెల్లడించారు.   

మరిన్ని వార్తలు