తిరుగు ‘మోత’

11 Oct, 2019 02:33 IST|Sakshi
ర్యాలీగా వెళుతున్న ఆర్టీసీ కార్మికులు

ప్రయాణికులకు ఆర్టీసీ సమ్మె పోటు

ఊళ్లకు వెళ్లిన వారికి తిరుగు ప్రయాణంలో వెతలు

చాలినన్ని బస్సుల్లేక ప్రైవేటు వాహనాలవైపు చూపు

సర్కారు హెచ్చరించినా ఆగని అధిక వసూళ్లు

సాక్షి, హైదరాబాద్‌: దసరా పండుగ నేపథ్యంలో ఊళ్లకు వెళ్లిన వారికి తిరుగు ప్రయాణం దడ పుట్టిస్తోంది. సమ్మె ప్రభావంతో ఆర్టీసీ బస్సులు గ్రామాలకు వెళ్లకపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్న వారికి షాక్‌ కొడుతోంది. సాధారణ బస్సు టికెట్‌ ధర కంటే ప్రైవేటు వాహనదారులు ఎక్కువ మొత్తంలో వసూళ్లకు తెగబడటంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. ఆరు రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా.. పండుగ నేపథ్యంలో తొలి 4 రోజులు పెద్దగా ఇబ్బందులు కనిపించలేదు. సమ్మె ఉంటుందని ముందే ఊహించడంతో పల్లెలకు వెళ్లాల్సిన వారంతా ముందుగానే గమ్యస్థానాలకు చేరుకున్నారు. సొంతూరుకు వెళ్లిన వారంతా ఇప్పుడిప్పుడే తిరుగు ప్రయాణమవుతున్నారు. దీంతో రద్దీకి సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు.

పాసులు అనుమతిస్తే నడపలేం.. 
ప్రయాణికుల నుంచి అధిక వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవన్న ప్రభుత్వం హెచ్చరికను ప్రైవే టు వాహనదారులు పట్టించుకోలేదు. గురువారం చాలాచోట్ల అధిక వసూళ్లు చేసినట్లు విమర్శలు వచ్చాయి. బస్‌పాసులు సైతం అనుమతించకపోవడంతో రోజువారీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్‌పాసులు అనుమతిస్తే బస్సులు నడపలేమని ప్రైవేటు బస్సు యాజమాన్యాలు ఆర్టీసీకి స్పష్టం చేశాయి. కొన్ని బస్సులకు పాసులు చెల్లవంటూ స్టిక్టర్లు అంటించి నడిపారు. పాసులు అనుమతించి రోజు వారీ టార్గెట్లు విధిస్తే కష్టమని, అలాగైతే రూటు మార్చుకుంటామని తేల్చి చెప్పా రు. పాసులు అనుమతించడంతో చాలా బస్సు లకు రోజువారీ ఆదాయం పదో వంతుకు పడిపోతోంది. ఈ అంశాన్ని ఆర్టీసీ అధికారులకు వివరిస్తే బస్సులు నడపకుండా ఆపేయాలని సలహా ఇస్తున్నట్లు కొందరు ప్రైవేటు బస్సుల యజమానులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా కొందరు పట్టణ ప్రాంతాలకు బదులు జిల్లా కేంద్రాలు, సర్వీసు రూట్ల వైపు బస్సులు తిప్పారు. దీంతో సిటీ, అర్బన్‌ ప్రాంతాలకు బస్సులు తగ్గాయి.

నోటిఫికేషన్‌ వస్తే పోరాటం 
సమ్మెలో పాల్గొన్న కార్మికులు సెల్ఫ్‌ డిస్మిస్‌ అయ్యా రని ఆర్టీసీ చెబుతున్నా.. కార్మికులకు మాత్రం ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. దీంతో నోటీసులు అందిన తర్వాతే స్పందించాలనే యోచనలో కార్మికులున్నారు. బస్సుల నిర్వహణలోనూ ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. 50 శాతం ఆర్టీసీ, 30 శాతం అద్దె ప్రాతిపదికన, 20 శాతం ప్రైవేటుకు ఇవ్వనున్నట్లు చెప్పింది. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులు రాలే దు. వీటికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వస్తే పోరాటానికి అనుకూలంగా ఉంటుందని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు.

సమ్మె నేపథ్యంలో నగరంలో పెరిగిన ఆటోల హడావుడి

ర్యాలీలు, నిరసనలు.. 
ఆర్టీసీ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, మానవ హారాలు, ధర్నాలు నిర్వహించారు. ప్రైవేటు వాహనాలను అడ్డగించారు. ఉద్యోగాలపై వేటు పడటంతో వేలాది కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఉద్యోగాలు పోతాయనే భయంతో ఉప్పల్‌లో ఓ డ్రైవర్‌ గుండెపోటుతో మృతి చెందాడు. చెంగిచెర్ల డిపోకు చెందిన కొమురయ్య ఉప్పల్‌ డిపో వద్ద నిర్వహిస్తున్న ర్యాలీలో ఉండగానే.. గుండెపోటు రావడంతో అక్కడిక్కడే మరణించాడు. అల్వాల్‌లోని హకీంపేట డిపోకు చెందిన కండక్టర్‌ పద్మ భర్త గుండెపోటుతో చనిపోయాడు. హెచ్‌సీయూ డిపోకు చెందిన డ్రైవర్‌ ఖలీల్‌ మియా రామచంద్రాపురం ఈఎస్‌ఐ వద్ద గుండెపోటుతో చనిపోయాడు.

గుండెపోటుతో డ్రైవర్‌ మృతి 
రామచంద్రాపురం(పటాన్‌చెరు): సమ్మె కారణంగా ఉద్యోగం పోయిందన్న బాధతో ఓ ఆర్టీసీ డ్రైవర్‌ గుండెపోటుతో మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలో గురువారం ఈ ఘటన జరిగింది. హెచ్‌సీయూ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న షేక్‌ ఖలీల్‌ మియా (48) రామచంద్రాపురంలోని బొంబాయి కాలనీలో నివాసిస్తున్నా డు. ఆయన టీజేఎంయూ తర ఫున ఆర్టీసీ సమ్మెలో పాల్గొంటున్నాడు. ఉద్యోగం పోయిందనే  బాధతో కలత చెందడంతో గుండెపోటు వచ్చింది. తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య సేవలు ఆగిపోయిన విషయం ఆయనను మరింత బాధ పెట్టిందని కుటుంబ సభ్యులు చెప్పారు. మరో ఆసుపత్రికి తరలించగా ఆయన మరణించినట్లు తెలిపారు.

గవర్నర్‌ను కలిసిన జేఏసీ నేతలు
ఆర్టీసీ జేఏసీ నేతలు గురువారం రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. ఆర్టీసీ సమ్మె, ప్రభుత్వ స్పందనతో పాటు కార్మికుల డిమాండ్లు, సంస్థ ఎదుర్కొంటున్న సమస్యలను ఆమెకు వివరించారు. సమ్మెకు ముందు ప్రభుత్వానికి, కార్మిక శాఖకు నోటీసులు ఇచ్చిన పరిస్థితులను తెలిపారు. దాదాపు 50 వేల మంది కార్మికులు సమ్మె చేస్తున్నా.. సీఎం కేసీఆర్‌ స్పందించలేదని, ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని, సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వంతో మాట్లాడాలని జేఏసీ నేతలు కోరారు. ఈ మేరకు జేఏసీ నేతలు ఆమెకు వినతిపత్రాన్ని అందించారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఆర్టీసీ జేఏసీ నేతలు రమేశ్‌ కుమార్, కత్తుల యాదయ్య, సుద్దాల సురేశ్, సుధాకర్‌ తదితరులున్నారు.

ఉద్యోగుల జేఏసీతో భేటీ వాయిదా
ఉద్యోగుల జేఏసీతో గురువారం జరగాల్సిన ఆర్టీసీ జేఏసీ సమావేశం వాయిదా పడింది. ఉద్యోగుల సంఘం జేఏసీ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్లడంతో సమావేశం వాయిదా పడింది. వీలైతే శుక్రవారం ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు మద్దతు కూడగట్టేందుకు అన్ని రాజకీయ, ఉద్యోగ సంఘాలతో ఆర్టీసీ జేఏసీ సమావేశమవుతోన్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు