ఇంట్లో కూర్చొని బీటెక్‌ చదువులా?

31 Oct, 2017 02:17 IST|Sakshi

హాజరు లేదంటూ పరీక్షలకు అనుమతించలేదని విద్యార్థుల పిటిషన్‌

అలాంటి చదువులతో ఉపయోగం ఉండదని హైకోర్టు చీవాట్లు

సాక్షి, హైదరాబాద్‌: తగినంత హాజరు లేదన్న కారణంతో తమను పరీక్షలకు అనుమతించడం లేదంటూ కోర్టును ఆశ్రయించిన విద్యార్థులకు ఉమ్మడి హైకోర్టు చీవాట్లు పెట్టింది. నిర్దేశించిన మేర హాజరు శాతం లేకుంటే పరీక్షలకు అనుమతించాలంటూ తామెలా విశ్వవిద్యాలయాన్ని ఆదేశించగలమని పేర్కొంది. తరగతులకు వెళ్లకుండా ఇంట్లో కూర్చొని బీటెక్‌ చదువుతామంటే ఎలా అని ప్రశ్నించింది. అలాంటి చదువులు ఎందుకూ పనికి రావని మందలించింది.

పరీక్ష రాయకపోతే మరోసారి అదే తరగతి చదవాల్సి ఉంటుందని, అందుకు సిగ్గుపడాల్సిన అవసరమేమీ లేదని, మళ్లీ చదివితే గట్టి పునాది ఏర్పడుతుందని విద్యార్థులకు చెప్పింది. నిబంధనల మేర 75 శాతం హాజరు ఉండాలని, 65–75 శాతం మధ్య హాజరున్న పిటిషనర్లకు మినహాయింపు విషయమై 10 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని వర్సిటీ అకడమిక్‌ కమిటీని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలిల ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.  

అప్పుడిచ్చారని...
బీటెక్‌ మూడో సంవత్సరం రెండో సెమిస్టర్‌ పరీక్ష రాసిన తమను తగినంత హాజరు శాతం లేదంటూ తదుపరి సంవత్సరానికి పంపకపోవడంతోపాటు రెండో సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలూ వెల్లడించడం లేదని పలువురు జేఎన్టీయూ, హైదరాబాద్‌ విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి, హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులను తదుపరి సంవత్సరానికి అనుమతించాలని వర్సిటీని ఆదేశించారు.

ఈ ఆదేశాలను సవాలు చేస్తూ ధర్మాసనం ముందు వర్సిటీ రిజిస్ట్రార్‌ అప్పీల్‌ దాఖలు చేయగా.. ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. వర్సిటీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. నిబంధనల ప్రకారం తగినంత హాజరు లేని విద్యార్థులను తదుపరి సంవత్సరానికి అనుమతించడం సాధ్యం కాదని కోర్టుకు తెలిపారు. ఈ విషయంలో సుప్రీం, హైకోర్టుల తీర్పులూ ఉన్నాయన్నారు. ధర్మాసనం స్పందిస్తూ..  హాజరు మినహాయింపులో తుది నిర్ణయం వర్సిటీదేనని స్పష్టం చేసింది.  

మరిన్ని వార్తలు