రైతుబంధు సాయం లేఖపై స్పందించిన హైకోర్టు

27 Jun, 2018 02:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైతుబంధు పథకం వల్ల ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపో తోందని, అర్హులకే ఆర్థిక సాయం అందచేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ నల్లగొండ జిల్లాకు చెందిన న్యాయవాది పి.యాదగిరిరెడ్డి రాసిన లేఖపై హైకోర్టు స్పందించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలని మంగళవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ, ఆర్థిక, రెవెన్యూ శాఖల ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 17కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఎకరాకు రూ.4 వేల సాయాన్ని రైతులందరికీ ఇవ్వడం వల్ల ప్రజాధనం వృథా అవుతోందని, అందువల్ల చిన్న, సన్నకారు రైతులకే ఆర్థిక సాయం అందించేలా చూడాలంటూ యాదగిరి రెడ్డి రాసిన లేఖను హైకోర్టు పిల్‌గా స్వీకరించింది.

మరిన్ని వార్తలు