కవ్వాల్‌ పులుల సంరక్షణ చర్యలేంటి?

6 Feb, 2019 03:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కవ్వాల్‌ పులులతో పాటు ఇతర జంతువుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలేమిటో వివరించాలని అటవీ శాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. అనుభవమున్న అధికారులు స్వయంగా కోర్టుకు వచ్చి వివరించాలంటూ విచారణను ఈ నెల 7కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్‌ తదితర జిల్లాల్లో విస్తరించి ఉన్న కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రంలో పులుల సంరక్షణ పథకాన్ని అమలు చేసేలా రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైదరాబాద్‌కు చెందిన జాగిర్‌ దియా సూర్‌ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది.

ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కవ్వాల్‌ అటవీ ప్రాంతంలో ఇటీవల పులుల మరణాలు చోటు చేసుకున్నాయని తెలిపారు. అటవీ ప్రాంతంలో నివసించే వారు తమ రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న విద్యుత్‌ ఫెన్సింగ్‌ వల్ల చనిపోయాయా? లేక మరో కారణం వల్ల చనిపోయాయా? అన్నది అంశం తేలాల్సి ఉందంది. అటవీ ప్రాంతంలో విద్యుత్‌ సరఫరా ఎలా జరుగుతోందని హైకోర్టు ఆరా తీసింది. ఈ వ్యాజ్యంలో విద్యుత్‌ శాఖ అధికారులను కూడా ప్రతివాదులుగా చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఈ విషయంలో అటవీ ప్రాంతాల సంరక్షణ కమిటీలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించింది. సమన్వయంతో పనిచేయకుంటే ఇటువంటి పరిస్థితులే వస్తాయంటూ కోర్టు విచారణ వాయిదావేసింది.  
 

మరిన్ని వార్తలు