కరోనా పరీక్షలు నిలిపేస్తున్నామని ఎలా చెబుతారు?

2 Jul, 2020 11:25 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న

సాక్షి, హైదరాబాద్‌: సౌకర్యాలు లేక కరోనా నిర్ధారణ పరీక్షలు నిలిపివేస్తున్నామన్న ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు ప్రకటనపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు చేస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెబుతుండగా, పరీక్షలు ఆపేశామని శ్రీనివాసరావు చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. శ్రీనివాసరావు ప్రజారోగ్యశాఖ సంచాలకుడిగా ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నారని హైకోర్టు ఆక్షేపించింది. రానున్న పది రోజుల్లో 50వేల పరీక్షలు నిర్వహిస్తామన్న ప్రభుత్వం, జూలై 1 నాటికి కేవలం 30,877 పరీక్షలు మాత్రమే నిర్వహించిందని, అది కూడా కేవలం 12 జిల్లాల్లో మాత్రమే నిర్వహించిందంటూ ప్రభుత్వ తీరును హైకోర్టు ఎండగట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఎత్తున పరీక్షలు జరుగుతుంటే, ఇక్కడ ఎందుకు సాధ్యం కావడం లేదని ప్రశ్నిం చింది. కరోనా పరీక్షల విషయంలో ప్రభుత్వం న్యాయస్థానానికి సమగ్ర వివరాలు అందించడం లేదంది. అరకొర వివరాలిస్తూ, కోర్టుతో పిల్లీ, ఎలుక ఆట ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. 

అలాగే ప్రజలను సైతం తప్పుదోవ పట్టిస్తోందని మండిపడింది. కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ఇటీవల కేంద్రం బృందం పర్యటించి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమైందని, ఆ వివరాలను తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అలాగే అసలు కంటైన్మెంట్‌ విషయంలో అనుసరిస్తున్న విధానం ఏమిటో తెలియచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కంటైన్మెంట్‌ ప్రాంతాల వివరాలను తమ ముందుంచాలంది. కరోనా పరీక్షలకు సంబంధించిన వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. తాము గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని, లేనిపక్షంలో తదుపరి విచారణ సమయంలో స్వయంగా తమ ముందు హాజరు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రజారోగ్యశాఖ సంచాలకులు, జీహెచ్‌ఎంసీ కమిషనర్, వైద్య, ఆరోగ్య శాఖ, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో డాక్టర్లకు అవసరమైన రక్షణ పరికరాల అందచేత, కరోనా పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై హైకోర్టులో వేర్వేరుగా పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం పై ఉత్తర్వులు జారీ చేసింది.

అస్పష్ట నివేదికలు...
ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ, రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు పూర్తిస్థాయిలో జరగడం లేదన్నారు. పాజిటివ్‌ కేసుల్లో రాష్ట్రం మూడో స్థానంలో ఉందని, ఇందుకు ప్రభుత్వ వైఖరి కారణమని వివరించారు. గత 10 రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ 2.11 లక్షల పరీక్షలు నిర్వహించారని, కాని తెలంగాణలో మాత్రం 31,877 పరీక్షలు నిర్వహించారని తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎక్కడెక్కడ కంటైన్మెంట్‌ జోన్లు ఉన్నాయో ఇప్పటివరకు ప్రకటించలేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, ప్రభుత్వం న్యాయస్థానానికి అస్పష్ట నివేదికలు ఇస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇస్తున్న నివేదికలకు మద్దతుగా ఆధారాలు సమర్పించడం లేదంది. నివేదికలను అఫిడవిట్‌ల రూపంలో తమ ముందు ఉంచడం లేదని, దీంతో తప్పుకు ఎవరు బాధ్యులో వారిని ప్రశ్నించడం సాధ్యం కావడం లేదంది. కరోనాకు సంబంధించిన వివరాలను ప్రాంతీయ పత్రికల్లో మొదటి పేజీలో ప్రచురించాలని గతంలో ఆదేశించామని, పారదర్శకంగా వ్యవహరించాలని, అన్నీ విషయాలు తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని తెలిపింది. పత్రికల్లో వివరాలు ప్రచురించకుండా ప్రభుత్వం ఎందుకు తొక్కిపెడుతోందని ప్రశ్నించింది. తాము కోరిన వివరాలతో పూర్తిస్థాయి నివేదికలు సమర్పించాలంటూ విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. 

మరిన్ని వార్తలు